నవతెలంగాణ – హైదరాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులతో సహా మొత్తం 186 మంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
విమానం గాల్లో ఉండగా, ఓ టిష్యూ పేపర్‌పై చేతిరాతతో ఉన్న బెదిరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. విమానాన్ని హైజాక్ చేస్తామని, బాంబు ఉందని ఆ నోట్‌లో ఉండటంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏవియేషన్ భద్రతా నిబంధనల ప్రకారం, పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి, విమానాన్ని సమీపంలోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.



