పియ్రమైన వేణు గీతికకు…
నాన్న ఎలా ఉన్నావు, ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ కూడా అలాగే ఉన్నాయన్నావు, జాగ్రత్తగా ఉండు తల్లి.
నాన్న.. కిందటి ఉత్తరంలో మన ఇంటికి ఎవరైనా వస్తే ఎలా ప్రవర్తించాలో చెప్పాను. ఈ ఉత్తరంలో మనం మరొకరి ఇంటికి వెళ్లేటపుడు ఎలా ఉండాలో చెప్తాను. ఎవరి ఇంటికైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా వాళ్లకు ఫోన్ చేసి, ఎప్పుడు రావాలో, వాళ్లకు ఎప్పుడు వీలవుతుందో తెలుసుకోవాలి. ఒక వేళ అవతలి వారు మేము ఉండటం లేదంటే, ఏరోజు రమ్మంటారో కనుక్కోవాలి. దాని ప్రకారం నువ్వు ప్రణాళిక వేసుకోవాలి.
అలాగే ఎవరి ఇంట్లోనైనా వున్నపుడు నీకు ఫోన్ వస్తే అర్జంట్ లేకపోతే నేనే ఫోన్ చేస్తాను, ప్రస్తుతం ఇంట్లో లేను అనాలి. కొందరి ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే భోజనానికి పిలిచాము కదా.. అని వచ్చే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వయసులో పెద్ద వారు, చంటి పిల్లల తల్లులు, పిల్లలు కనుక ఉంటే ముందు వారిని భోజనం చేయమని చెప్పాలి. ఎవరైతే పిలిచారో వారు ఎలాగూ నీ కోసం వేచి ఉంటారు. కొందరు బోర్ కొడుతుందేమో అని ‘టీవీ పెట్టమంటా రా’ అంటారు. అప్పుడు ‘వద్దండి మీతో స్పెండ్ చేయటానికి వచ్చాను కదా’ అనాలి.
నాన్న మరో ముఖ్యమైన విషయం.. ఎప్పుడైనా సరే ఎవరి ఇంటికి వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్లవద్దు. వారి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉండవచ్చు, చిన్న పిల్లలు ఉండవచ్చు. పళ్ళు, మిఠాయిలు, చిన్న పిల్లలు ఉంటే చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి తీసుకుని వెళ్ళాలి. అలాగే ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే పళ్ళు తీసుకుని వెళ్ళాలి. అయితే తరచూ కలిసే వారికి కచ్చితంగా ఏదైనా ఇవ్వాలి అని ఏమీ లేదు. వీలైతే ఇవ్వడం లేకుంటే లేదు.
అలాగే నీ ఇంటికి ఎవరైనా వస్తే ఉత్త చేతులతో పంపకు. వచ్చిన వారికి పళ్ళు, మిఠాయిలు.. ఏది ఉంటే అది ఇచ్చి పంపించు. కొత్తగా పెళ్ళైన దంపతులు, పెద్ద వయసు వారు మొదటి సారి నీ ఇంటికి వస్తే మనకు అవకాశం ఉంటే బట్టలు పెట్టవచ్చు. దీనివల్ల వచ్చిన వారు సంతోషంగా వెళ్తారు. అది నీకు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న పనులు ఎదుటి వారికి, నీకూ సంతోషాన్ని కలిగిస్తాయి నాన్న. నువ్వు చూస్తూనే ఉంటావు.. నేను ఎవరి ఇంటికి వెళ్లినా ఖాళీ చేతులతో వెళ్లను, అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఉట్టి చేతులతో పంపను.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీకు చెప్పాల్సిన బాధ్యత నాది. కొన్నాళ్ళకు నీకూ ఓ కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఇవి పాటించాలి. ఇప్పటికే నువ్వు కొన్ని పాటిస్తున్నావు, ఎవరి ఇంటికి వెళ్లినా గిఫ్ట్స్ కానీ, పళ్లు కానీ కొని తీసుకెళుతుంటావు. ఎవరైనా ఇంటికి వస్తున్నాం అంటే భోజనానికి రండీ అంటావు. అనుకోకుండా వస్తే వారికి వంట చేసి పెడతావు. ఇవన్నీ కూడా స్నేహ బాంధవ్యాలు మెరుగుపడటానికి దోహద పడతాయి. ముందు ముందు ఇలాగే కొనసాగిస్తావని ఆకాంక్షిస్తూ..
బంధాలు బలపడతాయి
- Advertisement -
- Advertisement -