Friday, May 9, 2025
Homeజాతీయంభయాందోళనలో సరిహద్దు ప్రజలు

భయాందోళనలో సరిహద్దు ప్రజలు

- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా, సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఈ పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాక్‌ను ఆనుకొని ఉన్న ఈ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాలలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తును సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పాఠశాలలు మూత పడ్డాయి. విమానాలను నిలిపివేశారు. పాక్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా భారత భద్రతా దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ను జరిపిన విషయం విదితమే. దీని తర్వాత పాక్‌ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశమున్నదన్న అంచనాల నేపథ్యంలో భారత్‌లోని సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తమ ఇండ్లను విడిచి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
పంజాబ్‌లో…
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో.. హజారా సింగ్‌ వాలా, గట్టి రాజో కే, తీండివాలా, తపు గ్రామాల నుంచి కుటుంబాలు.. వృద్ధులు, మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం ప్రారంభించాయి. ”ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మా గ్రామంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. పాక్‌ ప్రతీకారం తీర్చుకుంటుందని మేం భయపడుతున్నాం” అని జగ్తార్‌సింగ్‌ ఆందోళనను వ్యక్తం చేశాడు. తన కుటుంబాన్ని ముక్తసర్‌కు మార్చిన దర్బారా సింగ్‌.. ట్రాక్టర్‌-ట్రాలీలలో వస్తువులను లోడ్‌ చేస్తున్నట్టు వివరించాడు. కాగా, స్థానిక యంత్రాంగం ఇంకా ఖాళీ చేయాలని చెప్పనప్పటికీ.. ఇక్కడి ప్రజలు తరలివెళ్తుండటం గమనార్హం. పరిస్థితి మరింత దిగజారితే.. మేము కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతామని మరొక స్థానికుడు అన్నాడు. అమృత్‌సర్‌ వంటి నగరాల్లో నిత్యావసరాలు నిల్వ చేసుకోవటానికి నివాసితులు పెద్ద ఎత్తున రావటంతో కిరాణా దుకాణాలు, మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. అమృత్‌సర్‌, గురుదాస్‌పూర్‌, పఠాన్‌కోట్‌లలో పాఠశాలలు మూతపడ్డాయి. పాక్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌కు యాత్రికుల ప్రయాణాన్ని నిలిపివేసి.. కర్తార్‌పూర్‌ కారిడార్‌ను కేంద్రం నిరవధికంగా మూసివేసింది.
రాజస్తాన్‌లో…
రాజస్తాన్‌ సరిహద్దు జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జైసల్మీర్‌, బికనీర్‌, బార్మర్‌, శ్రీగంగానగర్‌లలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేయబడ్డాయి. శ్రీగంగానగర్‌ సమీపంలోని రైతులు సరిహద్దు నుంచి దూరంగా ఉండాలని సూచనలను అధికారులు చేశారు. పెట్రోలింగ్‌ పెరిగిందని స్థానికుడు ఒకరు తెలిపారు. జైసల్మీర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివేట్‌ చేయబడ్డాయి. పశ్చిమ రాజస్తాన్‌పై ఐఏఎఫ్‌ గాలింపులు కొనసాగుతున్నాయి.
గుజరాత్‌లో…
గుజరాత్‌లోని కచ్‌, బనస్కాంత, పటాన్‌ వంటి తీర ప్రాంత జిల్లాల్లో మెరైన్‌, పారామిలిటరీ దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. ఈ ఉద్రిక్త కాలంలో ఎలాంటి చొరబాట్లూ జరగకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. సుయిగామ్‌లో గ్రామస్తులు రాత్రిపూట లైట్లు ఆపేయాలని సూచించారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న తీవ్రమైన ఆందోళనలు ఇక్కడి ప్రజలలో కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -