Thursday, May 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి

- Advertisement -

– ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రం ఆపాలి: మంత్రి సీతక్క
– మంత్రిని కలిసిన భారత్‌ బచావో సంస్థ ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనీ, ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్‌ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) కోరారు. ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భారత్‌ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్‌ ఎమ్‌ఎఫ్‌. గోపీనాథ్‌, జంజర్ల రమేశ్‌బాబు భేటీ అయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని విన్నవించారు. ఆదివాసీలు అక్కడ భయాందోళనలకు గురవుతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..శాంతియుత వాతావరణ నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు. షెడ్యూల్‌ 5 పరిధిలోని ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయనీ, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. బల ప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల హక్కులను ఎవ్వరూ కాలరాయవద్దన్నారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తానని చెప్పారు. రెండు వైపులా ప్రాణనష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -