– రోడ్డులపై జన సంచారం నామమాత్రం
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో సోమవారం జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామంలో ప్రస్తుతం అరెస్టు భయం నెలకొనడంతో కొంతమంది ఇల్లు విడిచి వేరే గ్రామాల్లో బందువుల ఇంటికి వెళ్తున్నారు. గత ఐదురోజుల క్రితం గ్రామంలో బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామంలో ఇరు గ్రూపులు రాళ్లదాడికి పాల్పడడంతో ఉద్రిక్తత దారితీసింది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ,బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ముధోల్ పోలీస్ స్టేషన్లో గ్రామస్తులపై వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి .ఇప్పటికే ఐదుగురు ముఖ్య వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సంఘటన జరిగిన రోజు తీసిన వీడియో ఆధారంగా పోలిసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. సంఘటన జరిగిన రోజు ఎస్పి చాకచక్యంగా వ్యవహరించి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి గొడవను సద్దుమణిగించారు. ముధోల్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్సై సంజువ్ లు ఈ కేసుల పై విచారణ ప్రారంభించారు. ఈ గొడవలకు కారణమైన వారిని , అనుమానితులను అదుపులోకి తీసుకొని వీడియో ఆధారంగా విచారిస్తున్నారు. ప్రమేయం లేని వారిని వదిలి పెడుతున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని వీడియో ఆధారంగా గుర్తించి నిందితులను అరెస్టు చేసి ,నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో గ్రామంలో అరెస్ట్ ల భయం నెలకొనడంతో చాలామంది గ్రామం నుండి ఇతర గ్రామాలకు, తమ బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎక్కడ చూసిన పలు ఇండ్లు తాళాలు దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన రోడ్లపై కూడా జనసంచారం శనివారం నామమాత్రంగా కనిపించింది. గొడవల్లో ప్రమేయం ఉన్న వారిని మాత్రమే అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ, గ్రామంలో మాత్రం కేసుల భయంతో పలువురు ఇండ్లు విడిచిపోతున్నరు. ఈ ఘటన చాలా సున్నితమైనది కావడంతో జిల్లా ఎస్పీ శాంతిభద్రతలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో గత ఐదు రోజులుగా పోలీస్ పికెటింగ్ లు , ప్రత్యేక బందోబస్తు, పెట్రోలింగ్ సైతం పోలిసులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలను ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా వదిలి పెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బోరిగాంలో కేసుల భయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES