Magazines

టర్కీలో కాప్‌31 సదస్సు..బ్రెజిల్‌ అధ్యక్ష‍ుడు కీలక వ్యాఖ్యలు

1 గంట క్రితం

COP31 summit in Turkey: Brazilian President makes key remarks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ అజెండా నుండి గ్లోబల్‌ వార్మింగ్‌ అంశం అదృశ్యమైందని బ్రెజిల్ అధ్యక్ష‍ుడు లూలా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు గ్లోబల్‌ వార్మింగ్‌పై చర్యలు చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాల్గో సారి బ్రెజిల్‌ అధ్యక్ష‍ుడిగా బాధ్యతలు చేపట్టిన లూలా బుధవారం టర్కీలో జరిగిన కాప్‌31 సదస్సులో వాతావరణ మార్పులపై మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభం నుండి, ప్రపంచ స్థాయి నేతల ప్రసంగాల నుండి పత్రాల నుండి ‘పర్యావరణ మార్పులు’ అనే అంశం మాయమైపోయిందని అన్నారు.


ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ హౌస్‌ వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాలను ఒక్క చోట చేర్చే వేదికలైన జి7, జి20 సదస్సుల్లోనూ గ్లోబల్‌ వార్మింగ్‌పై చర్చ లేకుండా పోయిందని అన్నారు. భవిష్యత్‌ తరాల మనుగడ గురించి కాకుండా అత్యాధునిక ఆయుధాలు, టారిఫ్‌ల గురించి చర్చించుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన పరివర్తనను కొందరు జాతీయ భద్రతకు, శ్రేయస్సుకు అడ్డంకిగా చూడటం మొదలుపెట్టారని లూలా అన్నారు. నేడు యుద్ధం, ద్రవ్యోల్బణం మన ముంగిట తడుతున్నప్పుడు, రేపటి వాతావరణ విపత్తు గురించి ఆలోచించడం మరింత కష్టమవుతుందని అన్నారు. కానీ, కరువులు, వరదలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు ఇప్పటికే లక్షలాది మంది ప్రజలకు వాస్తవంగా మారినప్పుడు, ఆధిపత్య పోరాటాల దయాదాక్ష‍ిణ్యాల మీద ఈ అంశాన్ని వదలివేయలేమని అన్నారు.


వీటో అధికారం, ధనబలం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలవని, అదే సమయంలో బహుళపాక్ష‍ికత దౌత్యానికి ద్వారాలు తెరుస్తుందని లూలా అన్నారు. వాతావరణ సవాళ్లకు కొత్త పరిష్కారాలు కనుగొనడానికి రాజకీయ సంకల్పం అవసరమని ఆయన చెప్పారు. వాతావరణ సంక్షోభం అనేది ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. దేశాల మధ్య అసమానతలు, అలాగే లింగ, జాతి వివక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. ధనిక దేశాలు వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అభివృద్ధి చెందాయని, ఇప్పుడు అవి తమ బాధ్యతలను నెరవేర్చాలని లూలా అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్