నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా సభ్యత్వం పొందింది. ఈ మేరకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్లో సభ్యదేశాలుఉమ్మడి ప్రకటను విడుదల చేశాయి. అంతేకాకుండా బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగాండా ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు భాగస్వామి దేశాలుగా ఉండనున్నాయి.
ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి.
‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు.