– కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరువాత రోజూ సమీక్షలు
– కేసీఆర్‌తో కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం
– కవిత ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం
– లండన్ నుంచి రాగానే కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరంపై ఏర్పడిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లు, అధికారులను విచారించి నివేదికను ప్రభుత్వానికి అందజేయగా.. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయించినప్పటి నుంచి రోజూ సమీక్షలు జరుగుతున్నాయి. స్వయానా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు అప్పగించగానే మాజీ మంత్రి హరీశ్‌రావు విదేశాలకు వెళ్లారు. కేసీఆర్, హరీశ్‌రావు కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించడం ఒకెత్తయితే.. స్వయంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా విమర్శలు చేయడం మరో ఎత్తు. తన తండ్రి కేసీఆర్‌కు ఏ పాపం తెలియదని, కాళేశ్వరంలో హరీశ్‌రావు అవినీతికి పాల్పడి తన తండ్రిని దోషిగా నిలబెట్టినట్టు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు.
దీనికంతటికీ హరీశ్‌రావు, సంతోష్‌రావులే కారణమని చెప్పారు. ఇక దీంతో బీఆర్‌ఎస్ రాజకీయం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లికి మారింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌస్‌కు క్యూకట్టారు.
సమావేశాలతో కేసీఆర్ బిజీ బిజీ..
వారం రోజుల నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశాలతో కేసీఆర్ బిజిబిజీగా ఉన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డితో కేసీఆర్ సమీక్షించారు. సీబీఐ విచారణనే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సుదీర్ఘంగా నేతలతో చర్చలు జరుపుతున్నారు. కవిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కేసీఆర్ తన కూతురును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావుకు బాసటగా నిలిచారు. శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు లండన్ నుంచి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుని కేటీఆర్‌తో కలిసి కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఆరోపణలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
ఉమ్మడి మెదక్ ఉద్యమాల గడ్డ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే అడుగులు పడ్డాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. పార్టీ కార్యక్రమాలు మొత్తం ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట పిలుపులు సైతం ఫాంహౌస్ నుంచే వెలువడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫిరాయింపు ఎమ్మెల్యేలు వంటి అంశాలపై ఫాంహౌస్ కేంద్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో వారం రోజులుగా పాంహౌస్‌లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. శనివారం ఫాంహౌస్‌లో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజరు, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా పాల్గొన్నారు. ఆదివారం కూడా కేసీఆర్ నాయకులతో చర్చింనున్నట్టు సమాచారం. సీబీఐ విచారణపై పార్టీగా ఓ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలని, ఆ దిశగా పక్కా ప్రణాళికతో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి భరోసా ఇవ్వనున్నారని సమాచారం.
ఫాంహౌస్ కేంద్రంగా బీఆర్‌ఎస్ రాజకీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES