నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘పనాచే’ హోటల్ సమీపంలో ఉన్న ‘ట్విన్ టవర్’ అపార్ట్‌మెంట్‌లో గోపాల్ ఖేమ్కా నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిటీ ఎస్పీ సెంట్రల్ దీక్ష మాట్లాడుతూ, “గోపాల్ ఖేమ్కా హత్యకు గురైనట్టు మాకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ ప్రాంతాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాం. ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నాం. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నాం” అని వివరించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
