Wednesday, November 5, 2025
E-PAPER
Homeక్రైమ్చట్నీ మీద పడిందని దారుణ హత్య..

చట్నీ మీద పడిందని దారుణ హత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బట్టలపై చట్నీ పడిందన్న చిన్న కారణంతో ఓ వ్యక్తిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేశారు. అర్థరాత్రి లిఫ్ట్ ఇచ్చి, కారులో గంటలపాటు చిత్రహింసలకు గురిచేసి, చివరకు ప్రాణాలు తీశారు. ఈ కేసును రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.

నాచారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన మురళీ కృష్ణ (45) సోమవారం రాత్రి ఎల్బీనగర్ వద్ద ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడిగాడు. ఆ సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న మహమ్మద్ జునైద్ (18), షేక్ సైపుద్దీన్ (18), పొన్నా మణికంఠ (21), మరో 16 ఏళ్ల బాలుడు అతడిని కారులో ఎక్కించుకున్నారు.

మార్గమధ్యలో ఉప్పల్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో అందరూ ఆగి టిఫిన్ చేస్తుండగా, పొరపాటున మురళీ కృష్ణ ప్లేట్‌లోని చట్నీ ఓ యువకుడి బట్టలపై పడింది. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు మురళీ కృష్ణతో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా అతడిని బలవంతంగా తిరిగి కారులోకి ఎక్కించారు. తనను ఇంటి వద్ద దించేయమని మురళీ కృష్ణ ఎంత బతిమాలినా వారు వినలేదు.

తెల్లవారుజాము వరకు సుమారు రెండు గంటల పాటు కారులోనే తిప్పుతూ పిడిగుద్దులతో కొట్టారు, సిగరెట్లతో కాల్చారు. చివరకు ఉదయం 4:30 గంటల సమయంలో నాచారం పారిశ్రామికవాడలోని తెలంగాణ ఫుడ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కారులోనే కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. వారి నుంచి తప్పించుకునేందుకు మురళీ కృష్ణ అతికష్టం మీద కారులోంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సుమారు 200 మీటర్ల దూరం పరిగెత్తి, తీవ్ర గాయాలతో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన అనంతరం నిందితులు కారును శుభ్రం చేసి, కత్తిని పడేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం మౌలాలిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారును, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాలుడిని సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -