నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో 19 మందిని బలిగొన్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను మంగళవారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. మరోవైపు, బస్సు యజమాని వి.వినోదకుమార్ పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్న టేకూరు వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడు, ఉల్లిందకొండ ఎస్‌ఐ ధనుంజయ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో సాంకేతిక నివేదికలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ), అగ్నిమాపక శాఖల నుంచి నివేదికలు కోరుతూ అధికారులు లేఖలు రాశారు. ఇప్పటికే విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్‌ఎల్) నుంచి నివేదిక అందినట్లు సమాచారం. మిగిలిన రెండు శాఖల నుంచి నివేదికలు రాగానే, పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
పరారీలో ఉన్న యజమాని వినోదకుమార్‌ను వీలైనంత త్వరగా పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని దర్యాప్తు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నివేదికలు అందిన తర్వాత ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.



