నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్‌కతా పర్యటనలో నెలకొన్న గందరగోళంపై సిట్ చేపడుతున్న విచారణలో జోక్యం చేసుకునేందుకు కోల్‌కతా హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, విచారణ బలహీనమైందని నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లేవని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఈ దశలో దర్యాప్తులో జోక్యం చేసుకుని స్టే ఇవ్వలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సోమవారం మూడు పిల్స్ విచారణ ముగిసిన తర్వాత ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కోరినంత మాత్రాన, ఒక పార్టీ ఆరోపణలు చేసినందున దర్యాప్తును సిబిఐకి లేదా మరే ఇతర సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించలేమని పేర్కొంది. అరుదైన మరియు అసాధారమైన కేసుల్లో .. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని కచ్చితత్వంతో నిర్థారించినపుడు మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేయబడతాయని పేర్కొంది.
ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని, ప్రేక్షకులకు టికెట్ ధరలను తిరిగి చెల్లించాలని పిటిషనర్లు మూడు పిల్‌లలో కోర్టును కోరారు. తమ అభిమాన క్రీడాకారుడిని చూడలేకపోయామని, స్టేడియంలో గందరగోళం నెలకొనడంతో కార్యక్రమాన్ని ముందుగానే ముగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మెస్సీ చుట్టూ తిరుగుతూ ఉన్నారని, దీంతో గ్యాలరీల్లో ఉన్న ప్రేక్షకులకు ఆయనను చూడలేకపోయారని పేర్కొన్నారు.
డిసెంబర్ 13న కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియొనల్ మెస్సీ పాల్గొన్న కార్యక్రమం అస్తవ్యస్తంగా మారి తీవ్ర గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెస్సీ సరిగా కనిపించకపోయేసరికి వేలాది మంది అభిమానులు స్టేడియంలోకి బాటిల్స్, కుర్చీలు విసిరేశారు.



