Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంకలకత్తా జలమ‌యం..ఏడుగురు మృతి

కలకత్తా జలమ‌యం..ఏడుగురు మృతి

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎడతెరిపి లేకుండా.. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి కలకత్తా నగరం జలదిగ్బంధమయ్యింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు వేర్వేరు చోట్ల కరెంట్‌ షాక్‌లు తగిలి ఐదుగురు మృతి చెందారు. నేతాజీ నగర్‌, కాళికాపూర్‌, మొమిన్‌పూర్‌, బాలిగంజ్‌ ప్లేస్‌, బెనియాపుకూర్‌ ఏరియాలో.. ఒక్కొక్కరి చొప్పున చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలతో.. అధికారులు చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు. దుర్గా పూజ వేళ.. నగరంలో చాలా చోట్ల దేవీ మండపాలు నీట మునిగాయి. ఐఎండి నివేదిక ప్రకారం … గత 24 గంటల్లో నగరంలో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే.. గారియా కమదహారి ప్రాంతంలో 332 మి.మీ., జోధ్‌పూర్‌ పార్క్‌ వద్ద 285 మి.మీ., కాళీఘాట్‌ ఏరియాలో 280 మి.మీ, టాప్సియా వద్ద 275 మి.మీ వర్షం కురిసింది.

నీటమునిగిన రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు…

ప్రధాన రహదారులు నీట మునిగిపోవడంతో ట్రాఫిక్‌ రద్దీ నెలకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వర్షం ధాటికి.. హౌరా, సీల్దా, చిట్‌పూర్‌ రైల్వే స్టేషన్లు నీట మునిగిపోయాయి. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మెట్రో సేవలకు కూడా అంతరాయం కలిగింది. కోల్‌కతా మెట్రో సేవలు కూడా ప్రభావితమయ్యాయి. కోల్‌కతా విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దుర్గా మండపాలు దెబ్బ తినడంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు …
కోల్‌కతాకు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ 24 పరగణా జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -