నవతెలంగాణ మోటకొండూరు: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని నాయి బ్రాహ్మణ (మంగలి) మహనీయుల చరిత్ర, సేవలను స్మరించుకునే ఉద్దేశంతో రూపొందించిన నాయి బ్రాహ్మణ మహనీయుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ–శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ క్యాలెండర్‌ను రిటైర్డ్ తహసీల్దార్ వి. బాలరాజు ప్రత్యేకంగా ప్రచురించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, సామాజిక ప్రతినిధులు ఈ క్యాలెండర్‌ను నాయి బ్రాహ్మణ సమాజ చరిత్ర, గౌరవం, సేవా సంప్రదాయాలను కొత్త తరానికి పరిచయం చేసే ఒక ప్రాముఖ్యమైన ప్రయత్నంగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు జంపాల నాగచందర్ మాట్లాడుతూ, “భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ వంటి మహనీయుల పేరు ప్రస్తావన లేకుండా నేటి సామాజిక చర్చలు పూర్తికావు. సమాజ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులను స్మరించుకోవడం, వారి సేవలను తరతరాలకు పరిచయం చేయడం మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు.
మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ–శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సమాజానికి చెందిన అనేక మంది మహనీయులు రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో విశిష్ట సేవలు అందించారని తెలిపారు. భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్, ముత్తువేళ్ కరుణానిధి, ఎం. వీరప్ప మొయిలీ వంటి నాయకులు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా సేవలందించి తమదైన ముద్ర వేశారని గుర్తుచేశారు.వారితో పాటు ఉద్యమాల ఉపాధ్యాయుడు సాంబశివరావు బహుజనులకు మార్గదర్శిగా నిలిచి, ఎన్నో ఉద్యమాలకు ఊపిరి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గ కొమురయ్య, జంపాల మహేష్, జంపాల భాస్కర్, జంపాల శ్రీనివాస్, జంపాల ఆత్మరావు, జంపాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మోటకొండూరు పాలకవర్గ సభ్యులు, నాయి బ్రాహ్మణ సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


