తాజా పరీక్షలో నిర్ధారణ
భారీగా నష్టపరిహారం విధించిన లాస్ ఏంజెల్స్ కోర్టు
లాస్ ఏంజెల్స్ : మీరు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. ఈ పౌడర్ క్యాన్సర్ వ్యాధికి కారణమవుతోందని వైద్య పరీక్షలో తేలింది. ఓ కేసుకు సంబంధించి కంపెనీ పౌడర్‌ను పరీక్షించగా దిగ్భ్రాంతి కలిగించే ఈ విషయం బయటపడింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పౌడర్‌కు మార్కెట్‌లో ఎంతో మంచి పేరు ఉంది. చంటి పిల్లలకు సైతం బేబీ పౌడర్ వాడుతుంటారు. ఇక కేసు పూర్వాపరాలలోకి వెళితే… మెసోథెలియోమా వ్యాధితో మరణించిన ఓ మహిళ కుటుంబానికి 966 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) సంస్థను లాస్ ఏంజెల్స్ న్యాయస్థానం ఆదేశించింది. మెసోథెలి యోమా అనేది శరీరంలోని అంతర్గత అవయవాలను కప్పి ఉంచే పలుచని పొర. దీని కణాలు అసాధారణంగా పెరిగితే క్యాన్సర్ వ్యాధి సోకుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని ఇటీవల జరిపిన ఓ పరీక్షలో నిర్ధారణ అయిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాలిఫోర్నియాలో నివసించే మే మూరే అనే 88 ఏండ్ల మహిళ 2021లో చనిపోయారు. అదే సంవత్సరం ఆమె కుటుంబ సభ్యులు కంపెనీపై దావా వేశారు. జే అండ్ జే కంపెనీ టాల్క్ బేబీ పౌడర్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ ఫైబర్స్ ఉన్నాయని, వాటి కారణంగానే మూరేకు అరుదైన క్యాన్సర్ సోకిందని వారు ఆరోపించారు. ఆస్బెస్టాస్ ఫైబర్స్ అంటే సహజంగా లభించే పీచు ఖనిజ పదార్థం. ఇది వేడి, మంటను నిరోధిస్తుంది. దీనినే రాతినార అని కూడా అంటారు. ఇవి పొడవైన, సన్నని నారల మాదిరిగా ఉంటాయి. వీటిని పీల్చినా లేదా మింగినా ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కేసును విచారించిన జ్యూరీ జే అండ్ జే కంపెనీకి భారీ షాక్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి 16 మిలియన్ డాలర్లు నష్టపరిహారం కింద, 950 మిలియన్ డాలర్లు జరిగిన తప్పిదానికి శిక్షగా చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే చెల్లించాల్సిన నష్ట పరిహారం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే శిక్షగా చెల్లించే మొత్తం నష్టపరిహారంగా చెల్లించే మొత్తానికి తొమ్మిది రెట్ల కంటే మించకూడదు. కాగా లాస్ ఏంజెల్స్ కోర్టు తీర్పుపై వెంటనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వ్యాజ్యాలకు సంబంధించిన జే అండ్ జే అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ఎరిక్ హాస్ చెప్పారు. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా, విపరీతంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
తప్పుడు శాస్త్రీయ విశ్లేషణలను ఆధారంగా చేసుకొని పిటిషనర్ న్యాయవాదులు వాదనలు వినిపించారని, అలాంటి విశ్లేషణలను అసలు జ్యూరీకి సమర్పించకూడదని ఎరిక్ హాస్ తెలిపారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, వాటిలో ఆస్బెస్టాస్ లేదని, కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలే ఉండవని కంపెనీ చెబుతోంది. జే అండ్ జే కంపెనీ 2020లో అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసింది. ఆ తర్వాత మొక్కజొన్న పిండితో ఉత్పత్తిని చేపట్టింది. ఇదిలావుండగా మోరే కుటుంబం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ ట్రే బ్రాన్హమ్ కోర్టు తీర్పుపై వ్యాఖ్యానిస్తూ జే అండ్ జే కంపెనీ ఇకనైనా ఇలాంటి మరణాలకు బాధ్యత వహిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జే అండ్ జే ఉత్పత్తి చేసిన బేబీ పౌడర్, ఇతర టాల్క్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమకు క్యాన్సర్ సోకిందంటూ 67,000కు పైగా బాధితులు కంపెనీపై దావాలు వేశారు. టాల్క్ ఉత్పత్తి కారణంగా మెసోథెలియోమా సోకుతోందని కొందరు అంటుంటే చాలా మంది తాము అండాశయ క్యాన్సర్ బారిన పడ్డామని తెలిపారు.
దివాలా తీశానని చెప్పడం ద్వారా నష్టపరిహారాల నుంచి తప్పించుకోవాలని కంపెనీ చేసిన ప్రయత్నాలను ఫెడరల్ కోర్టులు మూడు సార్లు తిప్పికొట్టాయి. గతంలో జే అండ్ జే కొన్ని దావాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంది. కానీ దేశవ్యాప్తంగా పరిష్కరించుకునేందుకు సుముఖత చూపలేదు. మెసోథెలియోమా క్యాన్సర్‌పై దాఖలైన అనేక దావాలు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలలో విచారణలో ఉన్నాయి. గత సంవత్సర కాలంలో మెసోథెలియోమా కేసుల విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు కంపెనీ ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. అయితే తాజా తీర్పు భారీ నష్టపరిహారంతో కూడినది. కొన్ని కేసులను కంపెనీ గెలుచుకున్నప్పటికీ ఇంకా పలు దావాలు విచారణ దశలో ఉన్నాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌తో క్యాన్సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES