Tuesday, May 20, 2025
Homeజాతీయందీటుగా ఎదుర్కోలేరా?

దీటుగా ఎదుర్కోలేరా?

- Advertisement -

– నాటి నారాయణన్‌ శైలికి భిన్నంగా నేటి నేతల తీరు
– అమెరికా నాయకుల అవాకులు, చవాకులను తిప్పికొట్టని ప్రధాని, రాష్ట్రపతి
– భారత్‌, పాక్‌ను ఒకే గాటన కట్టినా మౌనం
– నాయకుల తీరు అవమానకరం, గర్హనీయం అంటున్న విశ్లేషకులు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు కళ్లెం వేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ దారుణంగా విఫలమయ్యారు. పాతికేండ్ల క్రితం కాశ్మీర్‌పై అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ను రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ దీటుగా ఎదుర్కొన్నారు. నాటి పరిణామం నుండి మోడీ ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా అని అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.
నాడు ఏం జరిగింది?
అది 2000వ సంవత్సరం మార్చి 21వ తేదీ. రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ గౌరవార్థం ప్రథమ పౌరుడు కేఆర్‌ నారాయణన్‌ విందు ఇచ్చారు. కాశ్మీర్‌ను అణుబాంబుల కేంద్రంగా, అత్యంత ప్రమాద కరమైన ప్రదేశంగా క్లింటన్‌ అంతకుముందు చేసిన వాఖ్యలపై విందులో రాష్ట్రపతి తీవ్రంగా స్పందించారు. భారత పర్యటనకు వచ్చే ముందు కాశ్మీర్‌పై క్లింటన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలలో భయాన్ని, ఆందోళనను రేకె త్తించే ఆ వ్యాఖ్యలను నారాయణన్‌ ప్రస్తావిస్తూ శాంతిని విచ్ఛిన్నం చేయాలని అనుకునే వారి ని, ఉగ్రవాదం, హింసలో మునిగి తేలాలని అనుకునే వారిని ప్రోత్సహించడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయని ఎత్తిపొడిచారు. ‘అణ్వా యుధాలను ముందుగా ఉపయోగిస్తామని చెప్పింది మేము కాదు. కాబట్టి ప్రమాదం మా వైపు నుండి జరగదు. అలాంటి నిబద్ధత ప్రదర్శించడానికి నిరాకరించే వారి నుండి అలాంటి ప్రమాదం వస్తుంది’ అని నొక్కి చెప్పారు. క్లింటన్‌పై నారాయణన్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికా పత్రికలు ప్రస్తావించాయి.
‘క్లింటన్‌ను మందలించిన నారాయణన్‌’ అనే శీర్షికతో వాషింగ్టన్‌ టైమ్స్‌ ఓ వార్తను ప్రచురించింది. కాశ్మీర్‌ గురించి క్లింటన్‌ చేసిన వర్ణనలను భారత రాష్ట్రపతి ఎగతాళి చేశారని తెలిపింది. భారత రాష్ట్రపతి కరాఖండీగా చెప్పి న మాటలపై క్లింటన్‌ నోరు మెదపలేకపో యారని చెప్పింది. కాగా నారాయణన్‌ అంత తీవ్రస్థాయిలో కాకపోయినప్పటికీ దక్షిణాసియా లో పొంచి ఉన్న ప్రమాదాలపై క్లింటన్‌ చేసిన వ్యాఖ్యలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి తిప్పి కొట్టారు. ‘ఈ ప్రాంతాన్ని అమెరికా అధ్యక్షుడు సందర్శించిన తర్వాత పరిస్థితి తాను ఊహించినంత దారుణంగా లేదని నిర్ధారణకు వస్తారని నాకు కచ్చితంగా తెలుసు’ అని వాజ్‌పేయి వ్యంగ్యోక్తులు విసిరారు.
ఒకే గాటన కడతారా?
భారత్‌, పాకిస్తాన్‌ దేశాలను ట్రంప్‌ ఒకే గాటన కట్టడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఉగ్రవాదానికి మూలంగా ఉన్న పాకిస్తాన్‌ను, అన్ని రంగాలలో ఆ దేశం కంటే ఎంతో ముందున్న భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ఒకేలా చూడడం దురదృష్టకరం. గర్హనీయం. ఉగ్రవాదాన్ని ట్రంప్‌ గట్టిగా ఖండించిన దాఖలాలు కూడా లేవు. పాకిస్తాన్‌ భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కరులు సీమాంతర ఉగ్రవాదానికి ఎలా పాల్పడుతున్నారో, దానివల్ల భారత్‌ ఎంతగా నష్టపోతోందో ఆయన ఎన్నడూ చెప్పలేదు. ట్రంప్‌ వ్యాఖ్యలలో స్పష్టంగా కన్పిస్తున్న ఈ లోపాన్ని రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ వేలెత్తి చూపలేదు. పాతిక సంవత్సరాల క్రితం కాశ్మీర్‌పై క్లింటన్‌ చేసిన ప్రకటనను రాష్ట్రపతి నారాయణన్‌ ఖండించిన తీరుకు ఇది పూర్తి భిన్నంగా ఉంది.
కాశ్మీర్‌ ద్వైపాక్షిక సమస్య అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెబుతున్నారే కానీ ట్రంప్‌ను ఎదుర్కోవడానికి మోడీ ఏ మాత్రం ధైర్యం ప్రదర్శించడం లేదని మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్‌ఎన్‌ సాహూ చెప్పారు.
అవమానకరమే
కాల్పుల విరమణపై ట్రంప్‌ చేసిన ప్రకటనను ప్రధాని మోడీ తిప్పికొట్టలేదు. ట్రంప్‌ ప్రభుత్వం వందలాది మంది భారతీయ వలసదారులను చేతులు, కాళ్లు కట్టేసి సైనిక విమానాలలో తిప్పి పంపినప్పుడు కూడా ఆయన కిమ్మనలేదు. ట్రంప్‌ చేసిన కాల్పుల విరమణ ప్రకటన మన దేశానికి అవమానకరమని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లినప్పుడు మనం ఏం చేయాలో కూడా అమెరికాయే నిర్ణయించడం దేశానికి తీవ్ర ఇబ్బందిని, అవమానాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో…నాడు కాశ్మీర్‌పై క్లింటన్‌ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ వాటిని దీటుగా తిప్పికొట్టిన తీరును ప్రస్తావించడం ఎంతైనా సముచితం.
అవాకులు..చవాకులు
ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఆపరేషన్‌ సిందూర్‌ మొదలైన మూడు రోజుల తర్వాత అంటే ఈ నెల 10వ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ భారత్‌, పాకిస్తాన్‌ కంటే ముందుగానే కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఇలా ఎందుకు చేశారని ఆయనను అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ నిలదీసిన పాపాన పోలేదు. సైనిక కార్యకలాపాల నిలిపివేతకు రెండు దేశాలు అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి మిస్రి చెప్పడానికి ముందే ట్రంప్‌ దానిపై ప్రకటన చేసేశారు. కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని కూడా ట్రంప్‌ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి, తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారు మార్కో రుబియో మరో అడుగు ముందుకు వేసి తటస్థ దేశంలో చర్చల ప్రారంభానికి భారత్‌, పాక్‌ అంగీకరించాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -