నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల అభ్యంతరకర కార్టూన్‌లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్టూనిస్ట్‌కి సుప్రీంకోర్టు అరెస్ట్ నుండి రక్షణ కల్పించింది. అయితే, సోషల్‌మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్‌లు షేర్‌చేస్తూ ఉంటే, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది.
సోషల్‌మీడియాను దుర్వినియోగ పరచడంపై ఆదేశాలు జారీ చేయడాన్ని పరిశీలిస్తూ.. వాటిని అడ్డుకునేందుకు ఏదైనా చేయాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజలు ఎవరికైనా, ఏదైనా చెబుతారని, వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడమంటే సోషల్‌మీడియాను దుర్వినియోగపరచడమేనని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకర పోస్టులను అడ్డుకునేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఈ పోస్ట్ 2021లో కొవిడ్ మహమ్మారి సమయంలో రూపొందించిన కార్టూన్‌కు సంబంధించినదని కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ తరపున న్యాయవాది వృందా గ్రోవర్ జులై 14న కోర్టుకు తెలిపారు.
హేమంత్ మాలవీయ అభ్యంతరకర పోస్ట్‌లతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, మతసామరస్యాన్ని దెబ్బతీశారంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వినరు జోషి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మాలవీయపై మే నెలలో ఇండోర్‌లోని లాసుడియా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఈ పోస్టు చేశారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. జులై 3న తనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కార్టూనిస్ట్ మాలవియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.