నవతెలంగాణ-హైదరాబాద్: పదవీచ్యుత ప్రధాని షేక్‌హేసీనాపై దాఖలైన దేశద్రోహం కేసులో మరో విచారణను ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని బంగ్లాదేశ్‌కోర్టు బుధవారం ప్రకటించింది. ఢాకా స్పెషల్ జడ్జి కోర్ట్ -9 జస్టిస్ ఎం.డి.అబ్దుస్ సలాం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు మీడియా తెలిపింది. ఈ అంశంపై వేర్వేరు అభ్యర్థలను పరిశీలించిన అనంతరం జడ్జి ఈ నిర్ణయం ప్రకటించినట్లు పేర్కొంది. 286మంది నిందితుల్లో, పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాతో సహా 259మంది ఇప్పటికే పరారీలో ఉన్నారని, వారిపై విచారణ జరుగుతోంది. హసీనా సహ పరారీలో ఉన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా వార్తాపత్రికలో నోటీసులు ముద్రించాల్సిందిగా కోర్టు గతేడాది అక్టోబర్ 14న ఆదేశించింది.
స్థానిక మీడియా అందించిన వివరాల ప్రకారం.. .. 2024 డిసెంబర్ 19న ‘జాయ్ బంగ్లా బ్రిగేడ్’ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో హసీనా మరియు పలువురు అవామీ లీగ్ సభ్యులు పాల్గొన్నారు. యుఎస్ అవామీలీగ్ నేత డా.రబ్బీ ఆలం నిర్వహించిన ఈ ఆన్‌లైన్ సమావేశంలో హసీనాను తిరిగి ప్రధానిగా నియమించేందుకు అంతర్యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేశారని పేర్కొంది. బంగ్లాదేశ్ మరియు విదేశాల నుండి మొత్తం 577మంది వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారని పేర్కొన్నారు. హసీనా ఆదేశాలను పాటిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది.
సిఐడి ఎఎస్‌పి మొహమ్మద్ ఎనాముల్ హక్ గతేడాది మార్చిలో హసీనా మరియు 72మందిపై కోర్టులో దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న హసీనా సహా 286మందిపై చార్జిషీటు సమర్పించారు. కోర్టు చార్జ్‌షీటును స్వీకరించి, నిందితులందరికీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలపై ప్రభుత్వం క్రూరమైన అణచివేత చర్యలకు పాల్పడినందుకు నవంబర్‌లో ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.



