నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ తమిళ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సహా పదిమంది బౌన్సర్లపై కేసు నమోదైంది. ఈ నెల 21న మదురైలో నిర్వహించిన టీవీకే సభలో లక్షలాదిమంది పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను విజయ్ కలిసేందుకు వీలుగా సభా వేదికపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెరంబలూరు జిల్లా కున్నం సమీపంలోని పెరియమ్మపాళయానికి చెందిన 24 ఏళ్ల శరత్‌కుమార్ ర్యాంప్ వాక్ వేదికపైకి ఎక్కి విజయ్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అతడిని అడ్డుకుని కిందికి తోసివేశారు. కిందపడిన శరత్‌కుమార్ గాయపడ్డాడు. శరత్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా కున్నం పోలీసులు టీవీకే అధినేత విజయ్, పదిమంది బౌన్సర్లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన భాష, దాడి, తోసివేయడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి.