నవతెలంగాణ-హైదరాబాద్: కలుషితమైన దగ్గు సిరప్‌ల వల్ల మధ్యప్రదేశ్‌లో 9 మంది, రాజస్థాన్‌లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించని మందుల కంపెనీపై చర్యలు తీసుకుంది. జైపూర్‌కి చెందిన కేసన్స్ ఫార్మా కంపెనీ తయారు చేసిన మందుల పంపిణీని ప్రభుత్వం నిలిపివేసిందని శుక్రవారం అధికారులు తెలిపారు. ఈ కేసన్స్ ఫార్మా కంపెనీ తయారు చేసే 19 మందుల సరఫరాను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వైద్య-ఆరోగ్య శాఖ నిలిపివేసిందని అధికారులు తెలిపారు. దీంతోపాటు డెక్స్ట్రోమెథోర్పాన్ కలిగిన అన్ని ఇతర దగ్గు సిరప్‌ల పంపిణీని కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిలిపివేశారు. అక్రమ పద్ధతిలో ఔషధ ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియను ప్రభావితం చేశారనే ఆరోపణలపై ఆ కంపెనీ డ్రగ్ కంట్రోలర్ రాజారామ్ శర్మను వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.
కాగా, ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. చిన్నారుల మృతుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని, తదనుగుణంగా వారిపై కఠినమైన చర్యల్ని తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమస్యపై విచారణకు ఆయన నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి గజేంద్ర సింగ్ కూడా విచారణకు ఆదేశించారు. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు డెక్స్ట్రోమెథోర్పాన్ సిరప్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం 2021లో అడ్వైజరీ జారీ చేసిందని తాజాగా వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గాయత్రి రాథోడ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. కేసన్స్ ఫార్మా కంపెనీ నాణ్యతా ప్రమాణాలను పాటించదని రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఎంఎస్‌సిఎల్) గతంలోనే నిర్ధారించింది. 2012లో పదివేలకు పైగా కేసన్స్ ఫార్మా ఔషధాల నమూనాలను పరీక్షిస్తే.. వాటిలో 42 మందుల తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేని ఆర్‌ఎంసిఎస్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పుఖ్రాజ్ సేన్ తెలిపారు.