No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంకులగణన తెలంగాణ మోడల్‌లో చేపట్టాలి

కులగణన తెలంగాణ మోడల్‌లో చేపట్టాలి

- Advertisement -

కేంద్ర గెజిట్‌లో కులగణన ప్రస్తావన లేకపోవడం దేనికి నిదర్శనం
ఇష్టంలేకే బీజేపీ కొత్త సాకులు వెతుకుతోంది : ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ సచిన్‌ పైలట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ మోడల్‌లో దేశ వ్యాప్తంగా నిర్వహించే జన గణనలో కులగణన చేపట్టాలని ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ సచిన్‌ పైలట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు కులగణనపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జనగణనపై కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఎక్కడా కులగణన ప్రస్తావనే లేకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌ ఆఫీస్‌లో సచిన్‌ పైలట్‌ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సమగ్ర కులగణన చేయాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. కానీ కులగణన చేపట్టాలని కోరిన కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలను ప్రధాని మోడీ పార్లమెంట్‌ వేదికగా అర్బన్‌ నక్సల్స్‌ అని ముద్ర వేశారని మండిపడ్డారు. కరోనా సాకుతో సాధారణ జన గణననూ చేపట్టకుండా బీజేపీ ప్రజల్ని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణనకు రూ. ఎనిమిది నుంచి పదివేల కోట్లు ఖర్చు అవుతుందనీ, కానీ కేంద్రం కేవలం రూ.570 కోట్ల మాత్రమే కేటాయించిందని, ఇది దేనికి సంకేతమని నిలదీశారు. ఇక గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ కులగణనపై స్పష్టత ఇవ్వకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టంగా కుల గణన అని పేర్కొందని గుర్తు చేశారు. సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత వివరాలను సేకరించేందుకు ఇంటింటి సర్వే చేపడుతోన్నట్టు తెలంగాణ సర్కార్‌ నోటిఫికేషన్‌లో మెన్షన్‌ చేసిందన్నారు. అలాగే కేవలం అధికారులతోనే కాకుండా.. నిపుణుల నేతత్వంలోని ఎన్‌ జీవోలు, విద్యావేత్తల మద్దతుతో కుల సర్వే జరిగిందన్నారు. ఈ తెలంగాణ మోడల్‌ ఆధారంగా కేంద్రం కుల గణన నిర్వహించాలన్నారు. కుల తత్వాన్ని కులగణన తీవ్రతరం చేస్తోందన్న బీజేపీ నేతల వాదనను కొట్టిపారేశారు. ఇది విభజన కాదని, సమానత్వానికి ఒక సాధనమని చెప్పారు. కుల గణన అంశం కేంద్రం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమస్యగా మిగిలిపోకూడదని హితవు పలికారు. మోడీ సర్కార్‌కు కులగణనపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే… కేంద్రం గెజిట్‌లో కులగణన అంశాన్ని పేర్కొనకపోవడం, జన గణనకు తక్కువ బడ్జెట్‌ కేటాయింపునకు కారణాలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుంటిసాకులతో జాప్యం చేయాలని ఆలోచనలు మానుకొని… తెలంగాణలో మాదిరిగా సమగ్ర కుల గణన చేపట్టాలని అన్నారు. సామాజిక న్యాయం, సమ్మిళిత విధాన రూపకల్పనలో కీలకమైన కుల గణన చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad