– కేంద్రమంత్రివర్గ నిర్ణయం
– ఎప్పటి నుంచో ప్రతిపక్షాల డిమాండ్
– ఎట్టకేలకు దిగొచ్చిన మోడీ సర్కార్
– ఇది మా విజయమే : ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న దేశవ్యాప్త కులగణనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై చర్చించేందుకు బుధవారంనాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమైంది.
కొన్ని రాష్ట్రాలకు రాజకీయ సాధనంగా కులగణన :కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కులగణన చేపట్టాయని అన్నారు. వాటిలో కొన్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా కులగణనను వాడుకున్నాయని ఆయన ఆరోపించారు. కులగణన నిర్ణయం తమ ప్రభుత్వం సమాజం, దేశ విలువలు, ప్రయోజనాలకు కట్టుబడి ఉందని నిరూపిస్తుందన్నారు. గతంలో తమ ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టిందని అన్నారు. ”కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కులగణనను వ్యతిరేకించాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిర్వహించిన అన్ని జనాభా గణన కార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్‌సభకు కులగణన అంశాన్ని క్యాబినెట్‌లో పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మంత్రుల బృందం ఏర్పడింది. చాలా రాజకీయ పార్టీలు కులగణనను సిఫారసు చేశాయి. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు బదులుగా కుల సర్వేను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సర్వేను ఎస్‌ఈసీసీ అంటారు” అని వైష్ణవ్ అన్నారు. ”కాంగ్రెస్, ఇండియా బ్లాక్ భాగస్వాములు కులగణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం జనాభా గణన అంశం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో 69లో జాబితా చేయబడింది. భారత రాజ్యాంగం ప్రకారం, జనాభా గణన అనేది కేంద్ర జాబితా అంశం. కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించడానికి సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకంగా లేని విధంగా రాజకీయ కోణం నుంచి మాత్రమే ఇటువంటి సర్వేలను నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను సృష్టించాయి. మన సామాజిక నిర్మాణం రాజకీయాలతో చెదిరిపోకుండా చూసుకోవడానికి, సర్వేలకు బదులుగా కులగణన ను జనాభా గణనలో చేర్చాలి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను సృష్టించాయి. ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సామాజిక నిర్మాణం రాజకీయాలతో చెదిరిపో కుండా చూసుకోవడానికి, సర్వేలకు బదులుగా కుల గణనను జనాభా గణనలో పారదర్శకంగా చేయాలి. ఇది సమాజం సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఎప్పటి నుంచో ప్రతిపక్షాల డిమాండ్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆ డిమాండ్‌ను ఇన్ని రోజులుగా కేంద్రం పక్కన పెడుతూ వస్తోంది. ప్రతిపక్షాలు ప్రతి సందర్భంలోనూ కులగణన అంశాన్ని లేవనెత్తుతూ వస్తోన్నాయి. ఈ క్రమంలో బుధవారం కులగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సంచలనంగా మారింది.
చెరకు మద్దతు ధర
చెరకు మద్దతు ధర క్యూటీఎల్‌కు రూ.355గా ప్రకటించారు. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం జరిగింది. 2025-26 చక్కెర సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్)లో చెరకుకు న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్‌ఆర్పీ)ను 10.25 శాతం ప్రాథమిక రికవరీ రేటుకు క్యూటిఎల్‌కు రూ.355గా ఆమోదించింది. 10.25 శాతం కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1 శాతం పెరుగుదల క్యూటీఎల్‌కు రూ.3.46 ప్రీమియంను అందిస్తుంది. రికవరీలో ప్రతి 0.1 శాతం తగ్గుదలకు క్యూటీఎల్‌కు రూ.3.46ని తగ్గిస్తుంది. అయితే, చెరకు రైతుల వడ్డీని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న చక్కెర మిల్లుల విషయంలో ఎటువంటి తగ్గింపు ఉండకూడదని కూడా నిర్ణయించింది. అటువంటి రైతులు తదుపరి చక్కెర సీజన్ 2025-26లో చెరకుకు క్యూటిఎల్‌కు రూ.329.05ను పొందుతారు. దాదాపు 5 కోట్ల మంది చెరకు రైతులు, వారిపై ఆధారపడినవారు చక్కెర కర్మాగారాల్లో ప్రత్యక్షంగా పనిచేసే 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.
అలాగే మేఘాలయ, అసోంలను కలుపుతూ రూ.22,864 కోట్ల వ్యయంతో 166.8 కిలోమీటర్ల పొడవైన షిల్లాంగ్-సిల్చార్ నాలుగు లేన్ల కారిడార్ హైవేను కూడా క్యాబినెట్ ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ”ఈ హైవే మణిపూర్, మిజోరం ప్రజలకు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ హైబ్రిడ్ మోడ్ కింద పరిగణించబడుతుంది” అని ఆయన తెలిపారు.
కులగణనకు కేంద్రం ఆమోదం మా విజయమే : ప్రతిపక్షాలు
దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం తమ విజయమేనని ప్రతిపక్షాలు అన్నాయి. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్, ఆర్జేడీ వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఈ రెండు పార్టీలూ కేంద్రాన్ని కులగణనకు తలొగ్గేలా చేయడంలో తాము విజయం సాధించామని ప్రకటించాయి. బీహార్‌లో కులగణన జరగటానికి, ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఒప్పుకోవడానికి తమ పోరాటమే పని చేసిందని చెప్పుకుంటున్నాయి. బీహార్‌లో ఈ ఏడాది ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కులగణనకు చేపట్టనున్నామనే అంశాన్ని అధికార ఎన్డీఏ, కేంద్రం కులగణనకు తలొగ్గేలా చేశామనే విషయాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్ తమ ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నాయి.
జనగణనతో పాటేకులగణన
- Advertisement -