ప్రియమైన వేణు గీతికకు…
చిట్టి తల్లి నీ రాక మాకెంతో సంతోషం కలిగించింది. నువ్వు మా దగ్గరే ఉన్నా నీకు లేఖ రాయడంలో అదో సంతృప్తి. నాన్న కిందటి ఉత్తరంలో ఆర్ధిక ప్రణాళిక గురించి రాసాను. డబ్బు ఉంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టి, తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు గురించి ఈ ఉత్తరంలో చెప్తాను. మన బంధువుల్లో ఒకరు కొద్ది నెలల కిందటే మరణించారు. అతను మరణించే నాటికి వాళ్ళ అమ్మాయి చదువుకూడా పూర్తికాలేదు. ఆ సమయంలో వాళ్ళు ఎలా బతకాలి, మా భవిష్యత్తు ఏమిటి అని చాలా దిగులు పడ్డారు.
అతను పని చేసే కంపెనీ నుండి డబ్బులు ఏమి రావు. ఉన్నడబ్బంతా ముందే ఖర్చు పెట్టేసారు. చివరకు ఒక సీఏతో మాట్లాడుకుని ఉన్న ఇల్లు అమ్మేసి, 3 బెడ్ రూముల అద్దె ఇంట్లోకి మారారు. అద్దె 30 వేలు, సంపాదించే వాళ్ళు లేరు. వాళ్ళ బంధువులు ముందుచూపుతో ‘ఇద్దరు ఆడవాళ్లకు అంత ఇల్లు ఎందుకు, అనవసరపు సామాను తీసేసి, చిన్న దాంట్లోకి వెళ్ళండి’ అని సలహా ఇచ్చారు. ఆ మాట అన్నందుకు వారికి కోపం వచ్చింది. ‘మిమ్మల్ని ఏమైనా ఆడిగామా’ అన్న రీతిలో మాట్లాడారు. ‘ఇక మా జీవితం, మా పరిస్థితి ఏమిటి, నాకు ఏదైనా అయితే పిల్ల పరిస్థితి ఏమిటి’ అని మొదలు పెట్టింది. వాళ్లకు సలహాలు ఇవ్వకూడదు కనుక ఏమీ కాదు అంతా బాగానే ఉంటుందని చెప్పి వచ్చేశాను.
ఆ తర్వాత విపరీతంగా ప్రయాణాలు, అది కూడా విమానాల్లో, ఐదు నక్షత్రాల హోటళ్లలో బస, ఏసీ క్యాబ్‌లు. డబ్బు లేనప్పుడు జాగ్రత్త పడాలి కదా! నిజానికి ఆ తల్లి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఒక ఇల్లు కొనుక్కుని, కూతురి పెండ్లి చేయటం. తర్వాత మిగిలిన డబ్బుతో వారి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. సంపాదించే వాళ్లు లేనప్పుడు మరింత జాగ్రత్త పడాలి. ‘కోట్లకు ఆధిపతులైనా సరే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వుండాలి, తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి’ అని పెద్దలు అంటారు. ఇంటికి పెద్ద దానివిగా పిల్లకు సమస్యలు వివరించాలి. ప్రతి విషయంలో నా కూతురి ఇష్టం అనటం సరైనది కాదు. వాళ్ల దగ్గర ప్రస్తుతం కోట్లు ఉండవచ్చు. ప్రయాణాలకు, విలాసాలకు చేసే ఖర్చు లెక్కలేసుకుంటే ఎన్నాళ్ళు వస్తాయి ఆ డబ్బులు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భవిష్య ప్రణాళికలు సరిగా లేకపోయినా, సంపాదించే వారు లేకపోయినా జీవితం దుర్లభం అవుతుంది. ఎవరైనా అనుభవంతో ఒక మంచి సలహా ఇస్తే దాన్ని పాటించటంలో తప్పులేదని నా అభిప్రాయం. జాగ్రత్త సుమా… జీవితంలో ఆచి తూచి అడుగువేయాలి.. వుంటాను..
జాగ్రత్త అవసరం
- Advertisement -
- Advertisement -