నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ రోజు (మంగళవారం) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డితో పాటు అప్పటి మంత్రి, పలువురు సీనియర్ అధికారులు నిందితులుగా ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ ఆలీఖాన్‌ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు ఆలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.
సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సీబీఐ కోర్టులో గత నెల వాదనలు పూర్తయ్యాయి. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సీబీఐ కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది.
నేడు ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES