Tuesday, May 13, 2025
Homeప్రధాన వార్తలుకాల్పుల విరమణ ఇలా..

కాల్పుల విరమణ ఇలా..

- Advertisement -


– తెరవెనుక అనేక చర్చలు
– భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలు అలర్ట్‌
– చర్చల కోసం ఇరు దేశాలకు పిలుపు
– ఎట్టకేలకు సీజ్‌ఫైర్‌కు ఓకే
న్యూఢిల్లీ:
గతనెల 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య పరిస్థితులు మారాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్న చర్చలు తీవ్రంగా మారాయి. భారత ప్రధాని మోడీ.. భద్రత దళాల ఉన్నతాధికారులతో సమావేశాలు, చర్చలు జరిపారు. ఈనెల 7న తెల్లవారుజామున 1.05 గంటలకు భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టింది. పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టటమే లక్ష్యంగా భారత్‌ దాడులు చేసింది. 25 నిమిషాల్లో భారత దళాలు ఈ ఆపరేషన్‌ను ముగించాయి. ఆ తర్వాత భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంఓ).. పాక్‌ డీజీఎంఓ మేజర్‌ జనరల్‌ కాషిఫ్‌ అబ్దుల్లాకు ఫోన్‌ చేసి.. పాక్‌, పీఓకేలలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడి చేసిందని 1.30 గంటలకు తెలియజేశారు.
ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత సాయుధ దళాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై 24 క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడులు కచ్చితమైనవి, తీవ్రతరం కానివనీ, పాక్‌ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకోలేదని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే ధ్వంసం చేసినట్టు భారత డీజీఎంఓ నొక్కి చెప్పారు. ఏప్రిల్‌ 22 ఘటన తర్వాత పాక్‌పై భారత చర్య ఎలా ఉండబోతున్నదన్న అంశంపై ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలించాయి. ఈ విషయంపై భారత్‌ను పలు ప్రపంచ దేశాలు సంప్రదించాయి. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు కొనసాగితే.. రెచ్చగొట్టే చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని భారత్‌ గతంలోనే స్పష్టం చేసింది. ఈనెల 1న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.. అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
పలు దేశాల ఆందోళన
ఆపరేషన్‌ ముగిసిన వెంటనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ మార్కో రూబియోతో పాటు ఇతర కీలక నేతలతో మాట్లాడారు. భారత్‌, పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదమున్నదని అనేక దేశాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఇందులో అమెరికా మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్‌, ఈజిప్ట్‌లు స్పష్టతను, సంయమనాన్ని కోరాయి. చర్చలకుకు ప్రోత్సహించాయి. భారత స్వీయరక్షణ (సెల్ఫ్‌-డిఫెన్స్‌)కు 12 దేశాలు మద్దతు పలికాయి.
ఆ 48 గంటల్లో పరిస్థితి తీవ్రం
మే 7న జరిగిన దాడుల తర్వాత 48 గంటల్లోనే పరిస్థితి తీవ్రమైంది. ప్రపంచ దేశాల నుంచి ఆందోళన తీవ్రంగా వ్యక్తమైంది. భారత్‌, పాక్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా పిలుపునిచ్చింది. మధ్యవర్తిత్వం వహించటానికి కూడా ముందుకొచ్చింది. పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ రెండు దేశాలు చర్చలు జరపాలనీ, పౌరులకు భద్రతను నిర్ధారించాలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూడా పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్‌ అల్జుబీర్‌ భారత్‌కు వచ్చి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి కూడా ఇదే ప్రయత్నాలు చేశారు.
బ్రిటన్‌ కార్యదర్శి చర్చలు
మే 9 రాత్రి పాకిస్తాన్‌.. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్తాన్‌ అంతటా అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారీ షెల్లింగ్‌ నిర్వహించింది. బారాముల్లా నుంచి భుజ్‌ వరకు 26 ప్రదేశాలలో డ్రోన్‌లు కనిపించాయి. ఒక్క పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే 15 డ్రోన్‌లు కనిపించాయి. రెడ్‌ అలర్ట్‌ తర్వాత వాటిలో చాలా వరకు నియంత్రించబడ్డాయి. అదేరోజు, బ్రిటీషు విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ.. జైశంకర్‌తో మాట్లాడారు. దౌత్యపరమైన మార్గానికి, సంయమనానికి పిలుపునిచ్చారు. డీజీఎంఓ లైన్‌ తెరిచే ఉన్నదని జైశంకర్‌ తెలిపారు. లామీ.. పాక్‌ నాయకత్వంతో కూడా చర్చలు జరిపారు.
మోడీకి వాన్స్‌ ఫోన్‌.. కాల్పుల విరమణ ఖరారు
మే 10 తెల్లవారుజామున అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌.. భారత ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి ఇలాంటి విజ్ఞప్తే చేశారు. పాక్‌ చేసే ఏదైనా దాడికి మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. అటు తర్వాత పాక్‌కు సమాచారం అందింది. మధ్యాహ్నం 1 గంటకు పాకిస్తాన్‌ డీజీఎంఓ.. భారత జీడీఎంఓకు ఫోన్‌ చేశారు. ఆ సమయంలో సమావేశాలు జరుపుతున్న భారత డీజీఎంఓ.. 3.35 గంటలకు రిటర్న్‌ కాల్‌ చేశారు. కాల్పుల విరమణ ప్రకటనలోని పదాల విషయంలో ఇరుపక్షాల మధ్య గణనీయమైన చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన వెంటనే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సాయంత్రం సోషల్‌ మీడియా వేదికగా దీనిని ప్రకటించారు.
కాల్పుల విరమణను ట్రంప్‌ ప్రకటించటంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షాలు ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ట్రంప్‌నకు మోడీ సరెండర్‌ అయ్యారని ఆరోపించాయి. కానీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తన చర్యను సమర్థించుకున్నది.
రంగంలోకి అమెరికా
మే 10న భారత వైమానిక దళం పాక్‌లోని రఫికి, మురిద్‌, చక్లాలా, రహీం యార్‌ ఖాన్‌, సుక్కూర్‌, చునియన్‌, పస్రూర్‌, సియాల్‌కోట్‌లలోని సైనిక లక్ష్యాలపై తీవ్రమైన కచ్చితమైన దాడులను నిర్వహించింది. ఈ దాడుల తర్వాత అమెరికా జోక్యం చేసుకున్నది. భారత్‌తో చర్చలు జరిపింది. అటు మర్కో రూబియో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌తో మాట్లాడారు. పాక్‌ అభ్యర్థన మేరకే ఇది జరిగినట్టు తెలుస్తున్నది. పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించటానికి రెండు వైపులా మార్గాలను అన్వేషించాలని మార్కో రూబియో పిలుపునిచ్చారు. కొన్ని గంటల తర్వాత రూబియో.. జైశంకర్‌కు ఫోన్‌ చేశారు. చర్చలకు పాక్‌ సిద్ధంగా ఉన్నదని తెలియజేశారు. ‘నిర్మాణాత్మక చర్చలు’ అవసరమని చెప్పారు. డీజీఎంఓ లైన్లు మాత్రమే కమ్యూనికేషన్‌ ఛానల్‌గా ఉంటాయనీ, భారత్‌ ఎలాంటి రాజకీయ, దౌత్య మార్గాన్ని సక్రియం(యాక్టివేట్‌) చేయదని పునరుద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -