భారత పాకిస్తాన్ మధ్య పరాకాష్టకు చేరిన సాయుధ ఘర్షణపై అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదట ఈ విషయం ప్రకటించగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ధృవపర్చారు. ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల విభాగం అధిపతులు మాట్లాడుకుని సంపూర్ణంగా,తక్షణమే దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటన వెలువడింది. అమెరికా హర్షించింది. అయితే తమ షరతుల మేరకే కాల్పుల విరమణ జరుగుతున్నట్టు భారత ప్రధాని మోడీ చెప్పారని ఆయన్ను కలిసిన ప్రతినిధులు వెల్లడించారు. ఇది ఏ మేరకు పూర్తిగా అమలవుతుందన్న దానిపైనా సందేహాలు కొనసాగుతున్నా ఒక కీలక ఘట్టం ముగిసినట్టుగా చెబుతున్నారు.మూడో దేశం ముచ్చటే లేదని మాట్లాడిన ఇండియా ఎందుకు అంగీకరించిందన్న దానిపైనా అనేక కథనాలు వస్తున్నాయి. ఏమైనా పహల్గాంలో టెర్రరిస్టుల ఘాతుక హత్యాకాండకు ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులు,దానికి ప్రతీకారంగా మళ్లీ పాక్ మన సరిహద్దుల్లో సాగించిన కాల్పుల్లో మరణాలు తీవ్ర పరిస్థితికి దారితీశాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సంఘపరివార్ అనుకూల శక్తులు, అంతర్జాతీయ సామ్రాజ్యవాద సమాచార మీడియా, సంచలనాల కథకులు వారి వారి పద్ధతుల్లో నడిపించిన ప్రచారాల తీరు అర్థమవుతుంది. సమయం సందర్భాలతో నిమిత్తం లేకుండా ఇలా జరగాలని, ఇలా జరగలేదని నిర్దేశించే యాంత్రికత, వివిధ శక్తుల పాత్ర అంతర్జాతీయ ప్రభావం,ఆయుధ సంపత్తి గురించి కూడా అనేక అర్థసత్యాలు, అవాస్తవాలు తెలుస్తాయి.
1.జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల కుట్ర చాలా తీవ్రమైంది, అమానుషత్వం నిండింది. జమ్ము కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనకుండా, సామాన్య ప్రజాజీవితం పునరుద్ధరణ జరగకుండా అడ్డుకోవడం పాక్ ప్రేరిత శక్తుల మొదటి పథకం. దేశ ప్రజల మధ్య మతాలవారీగా చిచ్చు పెట్టడం ఎందుకు? గతంలోనూ ఉరి, బాలాకోట్ సైనిక కేంద్రాలపై ఉగ్రవాద దాడులు, దానికి ప్రతి చర్యలు జరక్కపోలేదు. కానీ ఇక్కడ పనిగట్టుకుని పథకం ప్రకారం నిరాయుధులైన నిస్సహాయ యాత్రికులను దుర్మార్గంగా కాల్చి చంపారు. దేశంపై జరిగిన ఈ దాడిని ఒక మతంపై దాడిగా పక్కదోవ పట్టించేందుకు వారు పాచిక వేశారు. ఈ టెర్రరిస్టు శక్తులకూ, వాని వెనకనున్న పాకిస్తాన్ సైనిక కూటమికి పాఠం చెప్పడం తప్పనిసరి. భారత పాకిస్తాన్‌లు గత 50 ఏళ్లుగా కొట్టుకుంటున్నాయని చెప్పడమంటే రెండు దేశాలను ఒకే గాట కట్టడం అవుతుంది.1980లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రగతిశీల ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ రకరకాల ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు శిక్షణా కేంద్రంగా మారిపోయింది. ఎక్కడో ఒకచోట ఈ కుట్రలకు ప్రతి చర్య తప్పనిసరి. వారి పాత్ర నిర్ధారించే సాక్ష్యాధారాలు సేకరించటం అవసరమే అవుతుంది. అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని నిరూపించాలంటే సాక్ష్యాలు కావాల్సిందే.
ప్రతిపక్షాల స్పష్టత
2. పహల్గాం ఘాతుకం తర్వాత దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు టెర్రరిస్టు శక్తులపై తగు చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఆ చర్య ఏ రూపంలో ఉండాలన్నది అధికారంలో ఉన్న వారు నిర్ణయిస్తారు తప్ప మిగిలిన వారికి అవకాశం ఉండదు. సామాన్య పౌరులకు హాని జరగకుండా చూడాలని కేంద్రానికి స్పష్టం చేశాయి. ఇప్పటివరకు తాము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశామని మాత్రమే మోడీ ప్రభుత్వం చెబుతున్నది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో తొమ్మిది టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేసి వచ్చాక కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల వర్షం కురిపించిన పాక్ సైన్యం అనేకమంది ప్రాణాలు బలిగొన్నందుకే మళ్లీ దాడి అవసరమైందని చెబుతున్నది. డ్రోన్ యుద్ధాలు, సరిహద్దు కాల్పులు వీటి చుట్టూనే ఘర్షణలు సాగుతున్నాయి.
3. గతంలో ఏకపక్షంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి గొప్పగా ప్రచారం చేసుకున్న తీరుకూ ఇప్పుడు మెజారిటీ కోల్పోయిన ఒక ప్రభుత్వం అన్ని పార్టీలకు ఏదో ఒక రీతిలో సమాచారం ఇచ్చి అడుగులు వేయవలసిన పరిస్థితికీ తేడా కండ్ల ముందు కనిపిస్తుంది. గతంలోని విమర్శల కారణంగానే కేంద్రం ఎంపిక చేసి మరీ సోఫియా ఖురేషిని, అడ్మిరల్ వ్యోమికాసింగ్‌ను కూర్చోబెట్టవలసి వచ్చింది. ఇది పైపై ఎత్తుగడ అనే అభిప్రాయం తప్పు కాకపోయినా మార్పు మాత్రం గమనించ వలసిందే. మృతుడైన నౌకాదళ అధికారి భార్య హిమాన్షి నర్వాల్ మతపరమైన ద్వేషాలు వద్దని చెప్పడం, ఆమెపై ట్రోలింగ్ జరిగిందంటే దేశ ప్రజలలో లౌకికవాద, మత సామరస్య ప్రభావాలు గట్టిగానే పని చేస్తున్నాయని స్పష్టమవుతుంది. మతపరమైన శక్తులను ఖండించటం, ఎదుర్కోవటం ఎంత అవసరమో అకారణ మారణకాండతో కల్లోలం సృష్టించే టెర్రరిస్టు శక్తులను అడ్డుకోవటం కూడా అంతేే ముఖ్యమని గ్రహించటం అవసరం.
సైన్యంతోనే సమాధానమా?
4. టెర్రరిజాన్ని ఒక దెబ్బతో అణచివేయాలంటే సైన్యానికి సర్వాధికారాలు దఖలు పరచాలనే ధోరణి కూడా సరైనది కాదు. సైనిక దళాలు పౌర ప్రభుత్వానికి లోబడి ఉండటం భారతదేశంలో రాజ్యాంగ ఒరవడి. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్‌లో సైనిక కూటమి చెప్పు చేతల్లో నామకార్థపు ప్రభుత్వం నడుస్తుంటుంది. ఈ ఇద్దరినీ ఇస్లామిక్ చాందస శక్తులు ఆడిస్తుంటాయి. ఈ మొత్తం వ్యవస్థ సామ్రాజ్యవాద కూటమి చెప్పుచేతల్లో ఉంటుంది. ఇదంతా విష వలయం. గత ప్రభుత్వాలు మెత్తగా ఉంటే మోడీ మాత్రం చాలా శక్తివంతంగా పాకిస్తాన్‌ను తిప్పి కొడు తున్నారని వందిమాగధులు కీర్తిస్తుంటారు. మరోవైపున సైనిక దళాలతో సమీక్షిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా, ఏ చర్య తీసుకోవాలో వాటికే సర్వాధి కారాలు ఇచ్చినట్టు అధికార సమాచారం విడుదలవుతుంది. కానీ అంతిమంగా ప్రభుత్వ నిర్ణయాలు, నిర్దేశాల ప్రకారమే సైన్యం వ్యవహరించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తరహాలో భారతదేశంలో సైన్యం పౌర ప్రభుత్వం సమతుల్యత దెబ్బ తినడానికి ఆస్కారం ఇవ్వకూడదు.
5. ఇక తీవ్రవాదానికి, దాన్ని పెంచి పోషించే పాకిస్తాన్‌కు సమాధానం చెప్పాలంటే ఇజ్రాయిల్ తరహాలో నిర్దాక్షిణ్యంగా దాడి చేయాలని కొంతమంది చెబుతుంటారు. మరీ దారుణంగా గాజాపై ఇజ్రాయిల్ మరణాంతక దురాక్రమణను నమూనాగా తీసుకోవాలనే అవగాహనా రాహిత్యం చూస్తున్నాం. ఇలా వాదించే వారిలో కొందరు విద్యార్థులు కూడా వున్నారు. ప్రజాస్వామ్యం, శాంతి, సహకారం వంటి కనీస విలువలు తెలిసిన వారెవరూ ఇలా మాట్లాడరు. ఇజ్రాయిల్‌తో ఇండియా నలభైఏండ్లకు పౖగా ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోకపో వడానికి కారణం…పాలస్తీనా ప్రజలపై, అరబిక్ భూభాగాలపై దాని దురాక్రమణ, యుద్ధాలు దురంతాలే. ఇండియా వాస్తవానికి అరబ్బులతో సన్నిహితంగా ఉంటూ ఇజ్రాయిల్‌ను దూరం పెట్టింది. అసలు గాజాపై ఇజ్రాయిల్ మారణకాండతో భారతదేశాన్ని పోల్చుకోవడమే అమానవీయం.
అత్యుత్సాహంలో అసత్యాలు
6. యుద్ధంలో ముందుగా బలయ్యేది సత్యమేనని నానుడి. దాడులు, సంఘర్షణల వార్తలను అత్యుత్సాహంతో ప్రసారం చేసే ఆర్ణబ్ గోస్వామి లాంటి దురభిమాన శక్తులను స్వయంగా రక్షణ శాఖ తగదని హెచ్చరించవలసి వచ్చింది. సైనిక దళాల కదలికలు వాంఛనీయం కాదని హెచ్చరించింది. అనేక మీడియాలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సంస్థలు తామే యుద్ధ భూమిలో ఉన్నట్టుగా ఊహించు కుంటూ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పటికి చూస్తున్నది పరిమితమైన ఘర్షణ మాత్రమే. నిజంగా జరిగిన లాభనష్టాలు నెమ్మదిగాకానీ బయటికి రావు. ఈ కథనాలన్నింటిని పూర్తిగా నమ్మేసి పూనకాలు తెచ్చుకోవడం అవసరరలేని పని. బలూచిస్తాన్‌లో తిరుగుబాటు ఘటనలు నిజమైనా, అది విడిపోయినట్టుగానీ మొత్తం పాక్ కుప్పకూలిపోతున్నట్టుగానీ చిత్రించడం నిరాధారమే. భారత పాకిస్తాన్ లు ఇప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించాయంటేనే వచ్చిన కథనాలు ఎంత అతిశయాలతో నడిచాయో అర్థమవుతుంది.
7. పదేపదే అణ్వస్త్ర ప్రయోగం ప్రస్తావనకు వస్తున్నది.పాకిస్తాన్ మంత్రి తాము అణ్వస్త్రాన్ని వినియోగించాల్సి వస్తుందని అన్నారు. మామూలుగానే అణు యుద్ధంలో విజేతలు ఉండరని చెప్తుంటారు. అట్లాంటిది విడిపోయిన ఇరుగుపొరుగు దేశాలుగా భారత్ పాకిస్తాన్ ఆ ఆలోచన చేయడం కూడా సాధ్యమయ్యేది కాదు. భారతదేశం ముందు గా తాను అణ్వస్త్ర ప్రయోగం చేయనని ప్రకటించింది (నో ఫస్ట్ యూజ్) కనుక అసలు అవకాశం లేదు. ఇక పాకిస్తాన్‌కు ఆర్థికంగా ఆసక్తి కూడా లేదు. అంతర్జాతీయ సమాజం కూడా అందుకు అంగీకరించదు. వాజ్ పేయి హయాంలో 1998 మే 12, 13, 14 తేదీల మధ్య అణుబాంబు పరీక్ష జరిగితే మోడీ హయాంలో అది సాధారణ రాజకీయ చర్చగా మారడం యాదృచ్ఛికం కాదు.
విఫలతలూ చూసుకోవాలి
మోడీ గొప్పతనం గురించి చెప్పేవారు ఈ పరిస్థితి రావడానికి కారణమైన నిఘా వైఫల్యం గురించి విస్మరిస్తుంటారు. టెర్రరిస్టు ప్రమాదంపై చాలా సార్లు ప్రాథమిక సమాచారం అందించామని కూడా చెబుతున్నారు. కాశ్మీర్ ఇప్పుడు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం. అమిత్ షా హోం మంత్రిగా తరచూ సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు అక్కడ రక్షణ చర్చల్లో ఎలాంటి పాత్ర ఉండదు. మరి సామర్థ్యం గురించి కేంద్రం మాట్లాడేట ప్పుడు ఈ వైఫల్యాలను కూడా ఎత్తిచూపనవసరం లేదా? వైఫల్యాలకు కూడా కీలక నేతలు బాధ్యతలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలి.
9. మోడీ హయాంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించటం సంఘపరివారానికి ఇష్టమైన మాట. ట్రంప్ టారిఫ్ మోత మోగినా నోరెత్తలేనంత విధేయత ప్రదర్శించింది మోడీ సర్కార్. వాస్తవానికి చెప్పినట్టు తోకాడించే పాకిస్తాన్ లాంటి సైనిక ప్రాబల్య దేశాన్ని అమెరికా ఎన్నటికీ వదులుకోదు. సోవియట్ విచ్ఛినం తర్వాత చైనా, ఇండియాల మధ్య పాకిస్తాన్ ఉనికి అమెరికాకు చాలా కీలకం. చైనాతో కూడా పాక్‌కు బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని అమెరికాతో పోల్చలేము. భారతదేశంలో చారిత్రకంగా సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ ఈ రెండు దేశాలు బాధ్యత గల గొప్ప దేశాలుగా చాలా వేదికల్లో కలసి పనిచేస్తున్నాయి. కానీ బడా మీడియా చైనాను ప్రధాన శత్రువుగా చూపిస్తూ అమెరికాను వెనక్కు నెడుతూ ఉంటుంది. భారత వైమానిక దాడులపై ‘ఇది చాలా సిగ్గుచేటు. వారు ఎప్పటినుంచో పోట్లాడుకుంటున్నార’ని డోనాల్డ్ ట్రంప్ ఇండియా దాడి తర్వాత తొలి వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దాడి విచారకరం. వారు సాధారణ పరిస్థితి కోసం పని చేయాలని’ చైనా వ్యాఖ్యానించింది. ఇందులో ట్రంపు మాటలను మద్దతుగాను చైనా మాటలను వ్యతిరేకమైనవిగాను మన మీడియా చూపించింది. మోడీ నా మిత్రుడు అని ట్రంప్ అన్నాడని విపరీతమైన ప్రచారం జరిగింది. అదే వ్యక్తి రెండు దేశాలూ నాకు మిత్రులే అనేసరికి ఈ మీడియా చల్లగా జారుకుంది. పాక్ ప్రభుత్వానికి 100 కోట్ల బెయిలవుట్ మొత్తం రాకుండా చేయాలన్న మోడీ ఒత్తిడి కూడా పనిచేయలేదు. చివరకు కాల్పుల విరమణ ప్రకటన కూడా ట్రంప్ ద్వారానే ప్రపంచానికి తొలిగా తెలిసింది.
10. తమకు భిన్నంగా ఎవరు మాట్లాడినా దేశ వ్యతిరేక ముద్ర వేయడం దారుణమైన వాస్తవం. నదులు ఎవరూ పుట్టించినవి కాదు. ఆ నీరు ఎక్కడికి పోవాలో తేల్చవలసింది మనం కాదు అని నటి సమంత, మైనార్టీలపై దాడుల విషయంలో మనం గతంలో నింద మూటగట్టుకున్నామని ప్రకాష్‌రాజ్ అన్నందుకు కాషాయ మూక వారిపై విషం కక్కింది. పవన్ కల్యాణ్ అయితే సోషల్ మీడియాలో ‘కుక్కలు’ అంటూ వారిపై నోరు పారేసుకున్నారు. సెలబ్రెటీలు దేశాన్ని నడిపేవారు కాదని తక్కువ చేసి మాట్లాడారు. తప్పులెలా ఉన్నా వ్యక్తులు భావ ప్రకటనతో ఏదైనా మాట్లాడటం నేరం ఎందుకు అవుతుందో పవన్ వంటి వారే చెప్పాలి. విమర్శలను కూడా స్వీకరిస్తేనే దేశానికి మేలు జరుగుతుంది.
– తెలకపల్లి రవి
కాల్పుల విరమణ: నిన్నటి కథల నిజాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES