నవతెలంగాణ ఢిల్లీ: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలపై ఎట్టకేల కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘మన దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిది. దానికి అనుగుణంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాం. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశాం. విమర్శలు, వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేం ఎలా పనిచేయగలం? చనిపోయిన ఓటర్ల పేరుతో నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తాం? శాశ్వతంగా వలస వచ్చిన వారు, రెండు ప్రాంతాల్లో ఓటు రిజిస్టర్ చేసుకున్న వారు, విదేశీయులతో ఎలా ఓటు వేయిస్తాం? పారదర్శక పనితీరు కోసం ప్రక్షాళన చేయకూడదా? రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా దేశ పౌరులంతా ఈ ప్రశ్నలపై పునరాలోచన చేయాలి’’ అని సీఈసీ తన ప్రకటనలో పేర్కొంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణలో కీలక విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఈసీ తెలిపింది.
మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 7.68 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఆగస్టు 1 నుంచి ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్రంలోని 12 ప్రధాన పార్టీలతో పంచుకున్నామని, తద్వారా పేర్లను ఎందుకు తొలగించామో అందరికీ తెలుస్తుందని పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకు సామాన్యులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చని సూచించింది. అయితే, ఈ సమగ్ర సవరణను కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని దుయ్యబట్టాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది.