నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం (CWC) చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ మరియు ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తరపున జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, శాఖ సలహాదారు, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్) మరియు చీఫ్ ఇంజనీర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరితో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) మరియు CWC చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యులై సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తారు.



