నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్, లడఖ్ రాష్ట్ర హోదాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్రాన్ని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో జాప్యం చేయడం ద్వారా అవిశ్వాసాన్ని పెంచడం ద్వారా జమ్ముకాశ్మీర్, లడఖ్ రెండింటికీ ద్రోహం చేసిందని అన్నారు. కేంద్రం తన సొంత రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో విఫలమైందని, ‘అసాధ్యమైన’ హామీలతో రెండు రాష్ట్రాలను తప్పుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడఖ్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చుతామని హామీ ఇచ్చిందని అన్నారు. అయితే అది అసాధ్యం అని అందరికీ తెలుసు. ఒకవైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్‌తో సరిహద్దులను కలిగి ఉన్న ప్రాంతానికి గణనీమైన రక్షణ అవసరమని అన్నారు. ఎన్నికల కోసం తప్పుడు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. లడఖ్ నేతల పట్ల, ముఖ్యంగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పట్ల కేంద్రం భిన్నమైన వైఖరి ప్రదర్శించడాన్ని కూడా విమర్శించారు.
గతంలో ప్రధానిని పర్యావరణ యోధుడిగా కొనియాడారని, 2019లో కేంద్రపాలిత ప్రాంతం (యుటి) హోదా కల్పించి, అక్కడి ప్రజల కలలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపినపుడు ఎవరూ తప్పుపట్టలేదని అన్నారు. అటువంటి పెద్దమనిషికి అకస్మాత్తుగా ఈరోజు పాకిస్తాన్‌తో సంబంధాన్ని గుర్తించామని చెప్పారని ఇప్పుటికిప్పుడు గుర్తించారని కేంద్రాన్ని నిలదీశారు. మొదట డీలిమిటేషన్, తర్వాత ఎన్నికలు, చివరకు రాష్ట్రహోదా కల్పిస్తామని, ఇది మూడు దశల ప్రక్రియ అని మొదట్లో చెప్పారని అన్నారు. డీలిమిటేషన్, ఎన్నికలు రెండూ కూడా పూర్తయ్యాయని, కానీ రాష్ట్ర హోదా హామీ ఎందుకు నిలిచిపోయిందని ప్రశ్నించారు.