– కాంగ్రెస్ నాయకునిపైకి బాటిల్ విసిరిన
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓ లోకేశ్వర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసినట్టు వివరించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్ కల్పించుకొని ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ప్రతిపక్ష కార్యక్రమం కాదని, ఎమ్మెల్యేగా మాట్లాడే విధానం తెలుసుకోవాలని సూచించారు. అధికారులను బెదిరించడం సరైంది కాదనడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే తన చేతిలోని వాటర్ బాటిల్‌ను ఆయనపైకి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అదనపు కలెక్టర్ వారిని వారించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు గ్రూపులను అక్కడి నుంచి పంపించేశారు. ఎక్కడి నుండో వచ్చిన స్థానికేతరులు నియోజకవర్గంలో అధికారం చెలాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. 10 సంవత్సరాలు బీఆర్‌ఎస్‌లో అనేక రకాల పదవులు అనుభవించి ఇప్పుడు తమ పార్టీని విమర్శించడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేను అవమానించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఘటన మొత్తాన్ని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు తమ పార్టీ నాయకునికి కూడా చెబుతామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం సరైంది కాదన్నందుకు తనపై ఎమ్మెల్యే దాడి చేయడం హేయమైన చర్య అని శ్యామ్‌నాయక్ అన్నారు. బీఆర్‌ఎస్ పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి బాటిల్ విసరడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా విధానం మార్చుకోవాలని హితవు పలికారు.
రేషన్ కార్డుల పంపిణీలో రగడ
- Advertisement -
- Advertisement -