నవతెలంగాణ-హైదరాబాద్: రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వాహన్ అమలు కొనసాగిస్తోందని, త్వరలోనే సారథి సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖలో కృత్రిమ మేధ (AI) టెక్నాలజీని వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను నెలకొల్పుతున్నామని చెప్పారు. కార్యాలయాల్లో రెగ్యులర్‌గా వచ్చే దరఖాస్తుదారుల వివరాలు స్వయంచాలకంగా రికార్డ్ అవుతూ, హెడ్ ఆఫీస్‌కు అలర్ట్‌లు పంపే విధంగా సిస్టమ్ అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో వాహనాలకు సంబంధించిన రికార్డులు, టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే చర్యలు తీసుకున్నామని వివరించారు.
గత 10 సంవత్సరాల్లో రవాణా శాఖలో అవినీతి మూలాల్లా ఏర్పడిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు పారదర్శక వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. 112 మంది AMVI లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్, ఆర్టీసీతో పాటు ఇతర శాఖల్లో ఉన్న పాత వాహనాలను స్క్రాప్‌కి పంపించాలని ఆదేశించామని వివరించారు.