– ప్రత్యేకంగా మేం జైల్లో పెట్టక్కర్లేదు
– ములాఖత్‌కు వెళ్లినట్టే నేతలు ఫాంహౌజ్‌కు వెళ్లొస్తున్నారు
– కేసీఆర్ ఆరోగ్య రహస్యం తెలీదు
– కొడంగల్‌లో 15 వేల ఓట్లు తీసేయడంతో ఓడిపోయా
– బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదు
– ’42 శాతం’పై త్వరలో బీసీ సంఘాలు, భాగస్వాములతో భేటీ
– స్థానిక ఎన్నికలు ఆపడం వల్ల రాష్ట్రానికే నష్టం : ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”ఎర్రవెల్లి ఫాంహౌసే మాజీ సీఎం కేసీఆర్‌కు చర్లపల్లి జైలు. ఆయన్ని మేం ప్రత్యేకంగా జైలులో పెట్టాల్సిన పనిలేదు. చర్లపల్లి సెంట్రల్ జైలు బయటా పోలీసులు కాపలా ఉంటారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ బయటా పోలీసులు ఉంటారు. జైల్లో ఖైదీలతో ములాఖాత్‌కు వెళ్లినట్టే, అప్పుడప్పుడు ఆపార్టీ నేతలు ఫాంహౌస్‌కు వెళ్లి ఆయన్ని కలిసి వస్తుంటారు” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ”కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని తెలిసి పార్టీ నేతల్ని వెళ్లి చూడమన్నా. బీఆర్‌ఎస్ నేతలు వద్దన్నారని వారు చెప్పారు. మరి కేసీఆర్ ఆరోగ్యంలో ఏం సీక్రేట్ ఉందో నాకైతే తెలీదు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకబ్ చేస్తూ, ఉత్తమమైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించాను” అని తెలిపారు. ”నేను విద్వేష రాజకీయాలు చేయడం లేదు. కేసీఆర్ మాదిరి బిట్టర్ (చేదు) పాలిటిక్స్ రావు” అని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.
పీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
”బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఈ విషయంలో కేంద్ర హౌం శాఖతో సంబంధం లేనందున అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరలేదు” అని స్పష్టం చేశారు.
చర్చిద్దాం రండి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం సవాల్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులో అసలు ముస్లింల ప్రస్తావన ఎక్కడుందని సీఎం ప్రశ్నించారు. అసలు ఆ బిల్లుల్లో ఏముందో చదివారా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఈ దేశంలో పౌరులు కాదా? అని నిలదీసారు. ‘వెనుకబాటు, సామాజిక, ఆర్థిక ఆధారాలపై రిజర్వేషన్లు ఉంటాయి. మతపరంగా రాజ్యాం గం రిజర్వేషన్లు కల్పించలేదు. మేం మతం పేరుతో ఎక్కడా రిజర్వేషన్లు కల్పించలేదు. అసలు ఆ బిల్లుల్లో ఎక్కడా కుల, మతాల గురించి రాయలేదు. బీసీలకు 42 శాతం ఎన్ బ్లాక్‌గా రిజర్వేషన్లు కోరుతున్నాం’ అని స్పష్టం చేశారు. ముస్లింలు సీఎంలు కావద్దనేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు ఎప్పుడొస్తారో తేదీ, వేదిక, సమయం చెప్పండి” అని సవాలు విసిరారు. ముస్లింలను రాష్ట్రపతులు, ముఖ్యమంత్రుల్ని చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.
నైతికత ఆత్మహత్య చేసుకుంటుంది.
బీఆర్‌ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు చేసిన పాపాలకు ‘నైతికత’ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీహార్ ఎన్నికలతోపాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకూడా వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
మేమే సేఫ్…
‘పార్టీ మారడం తప్పు. పార్టీ మారితే వేటుపడుతుందని సుప్రీం తీర్పు ఇస్తే మేమే సేఫ్. మా దగ్గరున్న 65 మంది ఎమ్మెల్యేలు అలానే ఉంటారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
బీసీ సంఘాలతో భేటీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై త్వరలోనే బీసీ సంఘాలు, బీసీ భాగస్వాములతో భేటి అవుతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు.
పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు
”బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే, పార్టీ పరంగా 42 శాతం అమలుపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో చర్చిస్తాం. ఈ విషయంలో ఇతర పార్టీలు కూడా ముందుకొస్తే సంతోషం. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని కేసీఆర్ తెచ్చిన పంచాయితీరాజ్ చట్టం వల్లే సమస్య తయారైంది” అని చెప్పారు.
అర్థంలేని మాటలు
బీసీ రిజర్వేషన్లకు రాహుల్, ఖర్గే సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. జంతర్‌మంతర్‌లో బీసీ రిజర్వేషన్లపై పోరుబాటకు ఖర్గే, రాహుల్ రాలేదని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. ‘రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇందిరా భవన్‌లో నాలుగు గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నాలుగు గంటలు సావధానంగా విన్నారు. వంద మంది ఎంపీలకు వివరించారు. ఈ విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని తలకటోరా స్టేడియంలో జాతీయస్థాయి సదస్సు పెట్టి వివరించాం. జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ అంత్యక్రియలు, వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు రాహుల్ అక్కడికి వెళ్లారని తెలిపారు.
ఎర్రవల్లే కేసీఆర్‌కు చర్లపల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES