నవతెలంగాణ-హైదరాబాద్: 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేసన్ విడుదలకావడంతో ఓట్ల పండుగ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో రెండు దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. 6న మొదటి దఫా 121 అసెంబ్లీ స్థానాలకు, 11న మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే నెల 14న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఇప్పటికే బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం బయట ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకు వచ్చేస్తారు. అంత ఉత్సాహంగా.. ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఛత్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
ఛత్ పండుగను దీపావళి తర్వాత 6 రోజులకు జరుపుకుంటారు. ఈ పండుగను మహిళలే కాకుండా.. పురుషులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో చేపడతారు. ఉదయం సూర్య భగవానుని పూజించిన తర్వాత రాత్రిపూట ఛత్ పాటలు పాడతారు. అంతేకాకుండా వ్రత కథను చదువుతారు. ప్రతి రోజు ఉదయం 5-7 చెరుకు కర్రలను కలిపి ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. దాని కింద 12-24 దీపాలు వెలిగించి తేకువాతో పాటు సీజనల్‌లో వచ్చే పండ్లను సమర్పిస్తారు. ఛత్ పూజ సమయంలో ప్రసిద్ధమైన నైవేద్యం ‘తేకువా’. దీనిని గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో కరకరలాడేలా తయారు చేస్తారు.



