నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గడ్‌లో నంబాల కేశవరావుతోపాటు 26మంది మావోయిష్టులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు ప్రతిపాదించిన శాంతి చర్చలపై ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఆదిశగా శాంతి చర్చలకు ఏర్పాట్లు చేయడంలేదని ఆగ్రహించింది. మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు మవోయిస్టుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. కేంద్ర హోంమంత్రి డెడ్ లైన్ పేరుతో జాప్యం చేస్తున్నారని, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం చర్చల ప్రసక్తే అవసరంలేదని, ఫాసిస్ట్ పోకడలను అవలంభిస్తుందని, వారి మరణాలతో వేడుకలు నిర్వహించడం అప్రజాస్వామ్యమికమని పేర్కొంది.
అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు మావోయిష్టులతో శాంతి చర్చలు జరపాలని, వారి డిమాండ్లపై సంప్రదింపులు జరగాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయని, వెంటనే వారితో చర్చలు జరిపి, మావోయిష్టు వ్యతిరేక ఆపరేషన్లు వెంటనే శాశ్వతంగా నిలిపివేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
