Tuesday, April 29, 2025
Navatelangana
Homeఆటలుచిచ్చరపిడుగు సూర్యవంశీ

చిచ్చరపిడుగు సూర్యవంశీ

  • – 35 బంతుల్లోనే శతకబాదిన వైభవ్‌
    – యశస్వి జైస్వాల్‌ అజేయ అర్థ సెంచరీ
    – గుజరాత్‌పై రాజస్థాన్‌ ఘన విజయం
    14 ఏండ్ల బుడ్డోడు.. 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌లో వేగవంతమైన వంద బాదిన రెండో బ్యాటర్‌గా వైభవ్‌ సూర్యవంశీ (101) రికార్డుల మోత మోగించాడు.

    సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ (70 నాటౌట్‌) ధనాధన్‌తో 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే ఊదేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది.
    నవతెలంగాణ-జైపూర్‌
    14 ఏండ్ల బుడతడు వైభవ్‌ సూర్యవంశీ (101, 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) చిచ్చరపిడుగులా చెలరేగాడు. గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్లపై ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో సెంచరీ) తర్వాత మెరుపు సెంచరీ సాధించిన ఘనత దక్కించుకున్నాడు. 17 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సూర్యవంశీ.. సెంచరీ కోసం మరో 18 బంతులే తీసుకున్నాడు. 11 సిక్సర్లు, ఏడు ఫోర్లతో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజా విసిరాడు. జనత్‌ కరీమ్‌ ఓవర్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్న సూర్యవంశీ.. మాన్‌సింగ్‌ స్టేడియాన్ని హౌరెత్తించాడు. యశస్వి జైస్వాల్‌ (70 నాటౌట్‌, 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం అజేయ అర్థ సెంచరీతో రాణించటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మరో 25 బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నితీశ్‌ రానా (2) అవుటైనా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (32 నాటౌట్‌, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌) తోడుగా యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ను ముగించాడు. ఢిల్లీ, లక్నో సహా బెంగళూర్‌తో మ్యాచుల్లో ఛేదనలో చేజేతులా ఓడిన రాయల్స్‌.. సోమవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలుపొంది ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఛేదనలో అద్భుత శతకం బాదిన వైభవ్‌ సూర్యవంశీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. పది మ్యాచుల్లో రాయల్స్‌కు ఇది మూడో విజయం కాగా.. టైటాన్స్‌కు 9 మ్యాచుల్లో ఇది మూడో పరాజయం. తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (84, 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోశ్‌ బట్లర్‌ (50, 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్‌ (39, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. రాయల్స్‌ బౌలర్లలో తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు