– చికెన్, ఫిష్ వ్యర్ధాల మురుగునీరుతో అవస్థలు పడుతున్న స్థానికులు
– పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చికెన్ షాప్ యజమాని
– అధికారులూ పరిసరాల పరిశుభ్రత అంటే ఇదేనా?
– ముందుగానే నివారణ చర్యలు చేపడతారా?
– తాము అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తర్వాత స్పందిస్తారా?
– చోద్యం చూస్తున్న అధికారులు
– తాము ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నాం: స్థానికులు
నవతెలంగాణ – బోనకల్ : ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరొకవైపు అధికారులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. మరొకవైపు కొంతమంది తమ స్వార్థం, లాభార్జన కోసం చుట్టుపక్కల వారి జీవితాలతో ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు. పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆవాసాల మధ్య ఓ వ్యక్తి శ్రీశైలం చికెన్, లైవ్ షిప్ సెంటర్ ఏర్పాటు చేయటంతో సుమారు పది నివాస గృహాల కుటుంబాలు గత 20 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితులు బార్బర్ షాప్ యజమాని జిడుగు నరసింహారావు, సీజీఎం చర్చి పాస్టర్ బుంగ ఎర్నెస్ట్ పాల్, షేక్ మౌలాలి, పంతంగి శ్రీనివాసరావు, సైదులు తదితరులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో లోని స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో బోనకల్ మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం చికెన్, లైవ్ ఫిష్ సెంటర్ ను స్థలాన్ని కిరాయికి తీసుకొని సుమారు 20 రోజుల క్రితం పెట్టాడు. ఈ చికెన్, లైవ్ ఫిష్ సెంటర్ నివాసాల మధ్య ఉంది. చికెన్, ఫిష్ వ్యర్థాలకు సంబంధించి ఎటువంటి నివారణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. షాపు వెనుక ఓ చిన్న రెండు గుంతలు తీసి వరలు వేశాడు. చికెన్ మురిగినీరు, వ్యర్థం ఈ గుంతలలోకి వదులుతున్నాడు. మరొకవైపు లైవ్ ఫిష్ మురుగనీరు, వ్యర్ధాలను బహిరంగంగా పైపులు వేసి బయటకు వదులుతున్నాడు. చికెన్ మురిగినీరు, వ్యర్ధాలు నిండి ఆ గుంతలో ఉన్న మురుగనీరు బయటకు వస్తుంది. ఒకవైపు గుంతలు నిండి బయటకు వస్తున్న చికెన్ మురికి నీరు, వ్యర్ధాల నుంచి దుర్వాసన వెదజల్లుతుండగా మరొకవైపు
ఫిష్ మురుగనీరు, వ్యర్ధాలు బహిరంగంగా పైపుల ద్వారా బయటకు వదలడంతో ఆ ప్రాంతం మొత్తం అవి నెలవం ఉండి పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతుంది. పక్కనే ఓ బార్బర్ షాప్, చర్చి, హోటల్ ఉన్నాయి. అక్కడికి వచ్చినవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తమ వ్యాపారం గత 20 రోజులుగా దెబ్బతిన్నదని జిడుగు నరసింహారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు లక్షలాది రూపాయలతో ఇల్లు నిర్మించుకొని మా ఇళ్లల్లో కూడా ఉండలేకపోతున్నామని, ఆ దుర్వాసనకు కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రధాన రోడ్డు పక్కనే ఈ షాపు ఉండటంతో ఆ దుర్వాసన రోడ్డు వెంట వెళ్లే వారిని కూడా వెంటాడుతుంది. మొత్తం మీద ఆ ప్రాంతం అంతా చికెన్, ఫిష్ మురికినీరు, వ్యర్ధాల దుర్వాసనతో మురుకు కంపు కొడుతుంది. ఈ విషయంపై షాపు యజమానిని స్థానికులు నిలదీయగా తాను నివారణ చర్యలు తీసుకుంటానని, స్థానికులకు ఇబ్బందులకు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటానని 20 రోజులుగా చెబుతున్న అందుకు సంబంధించిన చర్యలు ఏమి తీసుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అధికారులు ఈ మార్గం గుండా వెళ్తుంటారు. అయినా అధికారులు కూడా ఎందుకు స్పందించడం లేదో, వారికి ఈ దుర్వాసన రావడం లేదా అంటూ పలువురు స్థానికులు వ్యంగస్థరాలు సంధిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్న శ్రీశైలం చికెన్, లైవ్ ఫిష్ సెంటర్ పై అధికారులు ఎందుకు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కావటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలు” ప్రజా ఆరోగ్యానికి వర్తించదా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్వాసనల మధ్య తాము ఎలా బతకాలని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారురు. తమ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న శ్రీశైలం చికెన్ సెంటర్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా, తాము అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన తర్వాత స్పందిస్తారా అని స్థానికులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.



