నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్సీబీ విజయోత్సవాల వేళ … బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే బాధిత కుటంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.
” జూన్ 4, 2025న మా హృదయాలు ముక్కలయ్యాయి. ఆ రోజు ఆర్సీబీ కుటంబంలోని పదకొండు మంది సభ్యులను మేము కోల్పోయాము. వారంతా మాలో భాగమే. మా జట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వారిది కీలక పాత్ర. వారు లేని లోటు పూడ్చలేనిది. ప్రతీ ఒక్కరిలోనూ వారి జ్ఞాపకాలను చూసుకుంటాము. కానీ మా మొదటి అడుగుగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చాము. కేవలం ఒక్క ఆర్ధిక సహాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో వారికి అన్ని విధాలగా సపోర్ట్‌గా ఉంటాము. అందుకోసం ‘ఆర్సీబీ కేర్స్’ పని చేస్తుంది ” అని ఆర్సీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అసలేం జరిగిందంటే …
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. పదిహేడేళ్ల తర్వాత తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో బెంగళూరు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ సైతం విజయయాత్రను ఘనంగా చేసుకోవాలని భావించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆర్సీబీ ప్లాన్ చేసింది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తీరని విషాదం నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలను కోల్పోయారు. 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులగా ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, డీఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.