నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో మూలీదేవి అలియాస్ మోనా అనే కిలాడీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నకిలీ ధ్రువపత్రాలతో ఏకంగా రెండేళ్లు రాజస్థాన్ పోలీస్ అకాడమీ (ఆర్‌పీఏ)లో ఎస్.ఐ.గా చలామణి అయ్యింది. మూలీ అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి రూ.7 లక్షల నగదు, మూడు పోలీసు యూనిఫాంలు, ఆర్‌పీఏ పరీక్ష పత్రాలు, నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యూనిఫారం ధరించి ఆర్‌పీఏ శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతూ సీనియర్ అధికారులతోనూ ఈమె ఫొటోలు దిగేది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన ఓ ట్రక్కు డ్రైవరు కుమార్తె అయిన మూలీ 2021లో రాజస్థాన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంటు పరీక్ష తప్పింది.
ఆ తర్వాత నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, ఎస్.ఐ. పరీక్షలో తాను ఉత్తీర్ణురాలైనట్లుగా సోషల్ మీడియలో వైరల్ చేసింది. పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్.ఐ.ల వాట్సప్ గ్రూపులో చేరి, రాజస్థాన్ పోలీసు అకాడమీలో క్రీడల కోటా కింద చేరిన మునుపటి బ్యాచ్ అభ్యర్థిగా పరిచయం చేసుకొంది. రెండేళ్లు అకాడమీలో అలాగే నెట్టుకొచ్చింది. కొంతమంది ట్రైనీ ఎస్.ఐ.లకు ఈమె మీద అనుమానం రావడంతో విషయం సీనియర్ అధికారుల దృష్టికి వెళ్లి అంతర్గత విచారణ మొదలైంది. బండారం బయటపడ్డాక గత రెండేళ్లుగా పరారీలో ఉన్న మూలీదేవి ఎట్టకేలకు పట్టుబడింది.