– ఎవరు వచ్చినా పదవిలో కొద్ది నెలల పాటే..
– కొత్త చీఫ్ గవారు పదవీకాలం ఏడు నెలలే..!
– తాజా మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నాది ఆరు నెలలు ొఅత్యధికంగా ఏండేండ్ల పాటు సేవలందించిన జస్టిస్ వై.వి చంద్రచూడ్
– అత్యల్పంగా 17 రోజులే పదవిలో జస్టిస్ కె.ఎన్ సింగ్
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పదవి చాలా కీలకమైనది. ఇటీవల ఈ పదవిని చేపడుతున్న పలువురు న్యాయ మూర్తులు కొన్ని నెలలు మాత్రమే సర్వీసులో ఉండి.. ఆ తర్వాత రిటైర్ అయిపోతున్నారు. దీంతో వారు ఎక్కువ కాలం సీజేఐలుగా ఉండటం కుదరటం లేదు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవారు.. బుధవారం భారత 52 సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పదవి చేపట్టిన రెండో దళిత, మొదటి బౌద్ధ మత వ్యక్తిగా గవారు పేరు సంపాదించారు. అయితే, ఆయన ఈ పదవిలో ఏడు నెలలు మాత్రమే ఉండనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న గవారు సీజేఐగా పదవీ విరమణ పొందనున్నారు.
తాజా మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పరిస్థితీ ఇందుకు భిన్నమేమీ కాదు. ఈయన కేవలం ఆరు నెలలు ఆ పదవిలో ఉన్నారు. సంజీవ్ ఖన్నాతో పోలిస్తే.. గవారు ఒకనెల ఎక్కువ సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. సంజీవ్ ఖన్నాకు ముందు సీజేఐగా ఉన్న డి.వై చంద్రచూడ్ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సంజీవ్ ఖన్నా, గవారులు స్వల్ప కాలం కొన్ని నెలలు మాత్రమే సీజేఐలుగా ఉండే అవకాశం దక్కితే.. డి.వై చంద్రచూడ్ మాత్రం రెండేండ్లు పదవిలో ఉన్నారు. గత ఏడున్నర దశాబ్దాల కాలంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న సీజేఐలలో డి.వై చంద్రచూడ్ పదవీ కాలం ఒకటి కావటం గమనార్హం.
సగటు పదవీకాలం 18 నెలలే..!
గత కొన్నేండ్లుగా సీజేఐల పదవీ కాలం చాలా తక్కువగా ఉంటున్నది. ఏప్రిల్, 2014 నుంచి ఆగస్టు, 2022 మధ్య చూసుకుంటే.. సీజేఐ సగటు పదవీకాలం దాదాపు తొమ్మిది నెల లుగా ఉన్నది. ఇక అంతకముందు దశాబ్దాలలోనూ సీజేఐల సగటు పదవీకాలం అంత ఎక్కువగా ఏమీ లేకపోయినా.. ఏడాదికి మించే ఉన్నది. 1950 నుంచి 2018 మధ్య ఉన్న డేటా ప్రకారం.. భారత ప్రధాన న్యాయ మూర్తుల పదవీ కాలం దాదాపు 18 నెలలుగా ఉన్నది. దీని అర్థం తక్కువ కాలం ఎక్కువ మంది సీజేఐలు పని చేశారు. ఉదాహరణకు, 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చిన జస్టిస్ యుయు లలిత్.. మూడు నెలల కంటే తక్కువే ఆ పదవిలో కొనసాగారు. 22వ సీజేఐ జస్టిస్ కె.ఎన్ సింగ్ 17 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. నవంబర్, 25, 1991లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న ఆయన.. అదే ఏడాది డిసెంబర్ 12న రిటైర్ అయ్యారు.
‘పదవీ విరమణ వయస్సు పెంపును పరిశీలించాలి’
1950 నుంచి పలువురు సీజేఐలు రెండేండ్ల కంటే తక్కువ కాలం మాత్రమే పని చేశారు. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం ఇలా జరుగుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏండ్ల వయసులో పదవీ విరమణ చేయాలి. నిబంధనల ప్రకారం.. న్యాయమూర్తుల్లోని అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సీజేఐగా నియమిస్తారు. కాబట్టి, ఎక్కువ సందర్భాలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ న్యాయమూర్తి రిటైర్ కావటానికి తక్కువ నెలలు మాత్రమే ఉండటంతో వారు ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేని పరిస్థితి ఉంటున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఇలా తక్కువ కాల వ్యవధిలోనే తరచూ సీజేఐలు మారటం న్యాయవ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును తిరిగి పరిశీలించటం ద్వారా సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
16వ సీజేఐగా వై.వి చంద్రచూడ్ హిస్టరీ
ఈ పదవిలో సుదీర్ఘ కాలం కొందరు మాత్రమే కొనసాగారు. 16వ సీజేఐ వై.వి చంద్రచూడ్.. అత్యధిక కాలం పదవిలో ఉన్నారు. ఏండేండ్లు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 22, 1978లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. జులై 11, 1985 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జస్టిస్ ఎ.ఎం.అహ్మదీ (1994-1997), జస్టిస్ ఎస్.హెచ్ కపాడియా (2010-2012)లు ఉన్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో చాలా తక్కువ
ఇతర దేశాలలోని న్యాయవ్యవస్థలతో పోలిస్తే భారత్‌లో పదవీ విరమణ వయసు చాలా తక్కువగా ఉంటున్నదని న్యాయ నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. యూఎస్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు జీవిత కాలం పాటు ఉంటాయి. అంటే, ఒక్కసారి నియమించబడిన తర్వాత.. జీవితకాలం సేవలందిస్తారు. అయితే, రాజీనామా, అభిశంసనల ద్వారా మాత్రమే వారు పదవి నుంచి తొలగించబడతారు. ఇక భారత సీజేఐ ర్యాంకుతో సమానమైన యూకేలో అక్కడి సుప్రీంకోర్టు అధ్యక్షుడు 70 ఏండ్లకు రిటైర్ అవుతారు. ఇక్కడ నియామకంలో సీనియారిటీ అనేది ప్రామాణికం కాదు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును పెంచే విషయంలో సంస్కరణలు అవసరమని పలువురు న్యాయ నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 70 ఏండ్లకు పెంచాలని వాదిస్తున్నారు.
సీజేఐ కుర్చీ స్వల్ప కాలమే
- Advertisement -
- Advertisement -