నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి, గులాబీ రంగులు వేయించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు “మా కార్యాలయం మాకు కావాలి” అంటూ ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్‌లోని ఫర్నిచర్ వస్తువులను ధ్వంసం చేసి తగలబెట్టారు. కార్యాలయ ప్రాంగణంలో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ఆఫీస్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.






