నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతిని ఎంచుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజా వేదికలో పాల్గొంటారు.
ఈ రోజు ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూకివాకం గ్రామం వెళతారు. అక్కడ తిరుపతి కార్పొరేషన్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుపతి కపిలతీర్థం చేరుకుని అక్కడ కపిలేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 నుంచి 3.45 దాకా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశమవుతారు. అనంతరం తిరుగు పయనం కానున్నారు. ఈ మేరకు సీఎంఓ షెడ్యూల్ ఖరారు చేసింది.