Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహార్వర్డ్‌లో సీఎం కాస్ట్‌లీ చదువు

హార్వర్డ్‌లో సీఎం కాస్ట్‌లీ చదువు

- Advertisement -

గురుకులాల్లో విద్యార్థులకు పాము కాట్లు : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాస్ట్‌లీ చదువులు చదివితే, రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాము కాట్లకు గురవుతున్నారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ గురుకుల స్కూల్స్‌ సంగతి దేవుడెరుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాము కాటుకు గురై ఆస్పత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్‌ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్‌ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా?అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది ఆయన పరిపాలనా వైఫల్యం కాదా?అని పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ అంటూ రంగుల లోకం చూపిస్తున్న రేవంత్‌ గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటని విమర్శించారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదనీ, చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడనీ, అపరిశుభ్రత కారణంగా గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదనీ, ప్రాణాలకు రక్షణ లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫొటోలకు పోజులిస్తే…ఇక్కడ పేద విద్యార్థులు ఆస్పత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. గుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా? లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా అని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలనీ, విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. ఎన్ని నోటీసులిచ్చినా భయపడేది లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -