నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రజాభవన్‌లో దివ్యాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ చేయనున్నారు. ఇదే వేదికపై చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించిన ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్లను వర్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ ఎక్స్ రోడ్స్ వద్ద దివంగత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఇక మధ్యాహ్నం 2.15 నుంచి 2:30 వరకు సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వెంటనే అన్ని సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చివరగా సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడలో ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి హాజరుకానున్నారు.



