– సన్న బియ్యంలో సగం నూకలే..
– స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి :
తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కేశంపేట : ఎన్నికల సమయంలో హామీలను గుప్పించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వాటిని అమలు పరచకుండా తుంగలో తొక్కారని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శనివారం ఆమె పర్యటించారు. వేముల్‌నర్వ గ్రామంలో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటూ కాకునూరులో చీమల రమేష్ కురుమ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టుకార్డుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెలా రూ.2500 ఇస్తానని చెప్పి సీఎం మోసం చేశారని ఆరోపించారు. మూడు నెలల నుంచి పింఛన్లు రాక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను తిడుతూ తన పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. సన్నం బియ్యంలో సగం నూకలే ఉన్నాయని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సుల ప్రయాణమంటూ మగవారికి టికెట్ల ధరలు పెంచి మోసం చేశారన్నారు. పేదల గుడిసెలను కూల్చడానికి బుల్డోజర్లు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, లేనియెడల మహిళలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ, సింగిల్ విండో చైర్మెన్ గండ్ర జగదీశ్వర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వాడ్యాల అనురాధ పర్వతరెడ్డి, మాజీ ఎంపీటీసీలు టేకుల రమాదేవి కోటీశ్వర్, పల్లె రాములు, మాజీ ఉప సర్పంచ్ సింగిడి జంగారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హామీలను తుంగలో తొక్కిన సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES