ఎండ వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇక ఇంట్లో ఉక్కపోత, బయట వేడితో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విపరీతమైన దాహంతో ఏదైనా చల్ల చల్లగా తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాము. చాలా మంది ఇష్టపడే డ్రింక్స్‌లో లస్సీ కూడా ఒకటి. మండే ఎండల్లో చల్లచల్లగా ఒక్క గ్లాసు తాగితే ఆ ఆనందమే వేరు కదా! ఇక దీని తయారీ కోసం ఉపయోగించే పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది సమ్మర్‌లో కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇది తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే లస్సీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా రకరకాల ఫ్లేవర్స్‌తో తయారు చేసుకోవచ్చు. అలా కొన్ని రకాల లస్సీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం…
డ్రైఫ్రూట్స్ లస్సీ
కావాల్సిన పదార్థాలు: చిక్కని, చల్లటి గడ్డ పెరుగు – కప్పు, పిస్తా – రెండు టేబుల్ స్పూన్లు, బాదంపప్పులు – రెండు టేబుల్ స్పూన్లు, అంజీర్ – ఒకటి, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ – పావు టీస్పూను, డ్రైఫ్రూట్స్ పలుకులు – కొద్దిగా.
తయారీ విధానం: ఓ బౌల్‌లోకి చల్లగా, చిక్కగా ఉన్న గడ్డ పెరుగు తీసుకుని విస్కర్ సాయంతో పలుకులు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన పెరుగును మిక్సీజార్‌లోకి తీసుకొని అందులో పిస్తా పలుకులు, బాదం పప్పులు, అంజీరా, పంచదార, కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ వేసి మధ్యమధ్యలో ఆపుకుంటూ స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. సుమారు ఐదు నిమిషాల పాటు హైస్పీడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్‌ను ఓ గ్లాస్‌లో పోసుకుని పైన డ్రైఫ్రూట్స్ పలుకులతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ డ్రైఫ్రూట్స్ లస్సీ రెడీ.
చాక్‌లెట్ లస్సీ
కావాల్సిన పదార్థాలు: చిక్కని, చల్లటి గడ్డ పెరుగు – కప్పు, చాక్లెట్ సిరప్ – మూడు టేబుల్ స్పూన్లు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: ఓ బౌల్‌లోకి చిక్కటి గడ్డ పెరుగు తీసుకుని విస్కర్ సాయంతో పలుకులు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీజార్‌లోకి తీసుకొని అందులో చాక్లెట్, సిరప్, పంచదార వేసి హై స్పీడ్ మధ్యమధ్యలో ఆపుతూ సుమారు ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్‌ను ఓ గ్లాస్‌లో పోసుకుని పైన చాక్లెట్ సిరప్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ చాక్లెట్ లస్సీ రెడీ.
పంజాబీ లస్సీ
కావాల్సిన పదార్థాలు: చిక్కటి, చల్లని గడ్డ పెరుగు – కప్పు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను.
తయారీ విధానం: ఓ బౌల్‌లోకి చిక్కటి గడ్డ పెరుగు తీసుకుని విస్కర్ సాయంతో పలుకులు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగును మిక్సీజార్‌లోకి తీసుకొని అందులో పంచదార, యాలకుల పొడి వేసి హై స్పీడ్ మధ్యమధ్యలో ఆపుతూ సుమారు ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్‌ను ఓ గ్లాస్‌లో పోసుకుని సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ పంజాబీ లస్సీ రెడీ.
మ్యాంగో లస్సీ
కావలసిన పదార్థాలు: పండిన మామిడికాయలు – రెండు, పెరుగు – కప్పు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు (లేదా రుచికి సరిపడా), ఏలకుల పొడి – అర టీ స్పూను, ఐసు ముక్కలు – కొద్దిగా, పిస్తా పప్పు – అలంకరణ కోసం.
తయారీ విధానం: ఒక బ్లెండర్‌లోకి మామిడికాయ ముక్కలు, పెరుగు, పంచదార, ఏలకుల పొడి, కొన్ని ఐసు ముక్కలు వేయండి. మెత్తగా అయ్యే వరకు కలపండి. గ్లాసులలో పోసి, పైన మామిడికాయ ముక్కలు లేదా పిస్తా పప్పుతో అలంకరించండి. అంతే రుచికరమైన మ్యాంగో లస్సీ రెడీ…
చిట్కాలు: లస్సీని మరింత చల్లగా చేయాలనుకుంటే ఎక్కువ ఐసు ముక్కలు వేయవచ్చు. మరింత తీపి కావాలనుకుంటే పంచదారను మరింత వేసుకోవచ్చు. ఏలకుల పొడిని బదులుగా ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగించవచ్చు.
చల్లచల్లని లస్సీ
- Advertisement -
- Advertisement -