నవతెలంగాణ-హైదరాబాద్: : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పల్లెల్లో ఉదయం పొగమంచు కప్పబడి ఉంటుంది. గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం 5 దాటితే చాలు చలి వణికించేస్తోంది. ఈ తరుణంలో రాబోయే మూడు, నాలుగు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో పాటు తీవ్రమైన కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదయ్యాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో పలు చోట్ల అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చలిగాలుల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ నేడు(ఆదివారం) ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, జనగాం, మెదక్ సహా పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ తీవ్రమైన చలిగాలుల దృష్ట్యా, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.



