– అండమాన్ నికొబార్ దీవుల ఎస్‌ఎఫ్‌ఐ సదస్సులో మయూఖ్ బిశ్వాస్ పిలుపు
పోర్ట్‌బ్లెయిర్: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో మతం ప్రాతిపదికన విద్యార్ధులను చీలుస్తున్నారని భారత విద్యార్ధి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిశ్వాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ అండమాన్ నికొబార్ దీవుల రాష్ట్ర సదస్సు ఆదివారం ఇక్కడి షాహీద్ భవన్‌లో జరిగింది. సదస్సును ప్రారంభిస్తూ మయూఖ్ ప్రసంగించారు. అండమాన్, నికొబార్ దీవుల్లోని కాలేజీలు ఇప్పటివరకు పుదుచ్చేరి యూనివర్శిటీకి అనుబంధంగా వున్నాయని, ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేసిన డీమ్డ్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశారని విమర్శించారు. అండమాన్ దీవుల్లోని విద్యార్ధులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికై, విద్యార్ధుల చట్టబద్ధమైన హక్కుల కోసం ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని పిలుపిచ్చారు. ఇందుకోసం విద్యార్ధులందరినీ సంఘటితం చేయాల్సిందిగా అండమాన్, నికొబార్ దీవుల ఎస్‌ఎఫ్‌ఐ కమిటీని బిశ్వాస్ కోరారు. అందరికీ విద్య, అందరికీ ఉపాధి అన్నది ఎస్‌ఎఫ్‌ఐ నినాదమంటూ సంస్థ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర నిర్వాహక కమిటీ కన్వీనర్ అబ్దుల్ వారిష్ ప్రసంగిస్తూ దీవుల్లోని విద్యార్ధుల డిమాండ్లను వివరించారు. రాబోయే రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఒక శక్తిగా అవతరిస్తుందని అన్నారు. జెఎన్‌ఆర్‌ఎం పూర్వ విద్యార్ధుల సమాఖ్య చైర్మెన్ డి.అయ్యప్పన్, దీవుల డీవైఎఫ్‌ఐ కార్యదర్శి డిజోలు కూడా సదస్సులో విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. దీవుల్లోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై సదస్సు అనేక తీర్మానాలను ఆమోదించింది.
హక్కుల కోసం సంఘటితంగా పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES