నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
మంగళవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారికి అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న నిల్వల నాణ్యతను స్వయంగా పరిశీలించి, కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా అనే అంశాన్ని పరిశీలించారు. తేమశాతం (moisture content) యంత్రం సహాయంతో పరీక్షించి, పంట నాణ్యతను అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం ప్రమాణాలు సరిగ్గా పాటించబడుతున్నాయా లేదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను సమీప ప్రాంతాల్లో మరింత అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడా అన్ని వసతులను అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చిన పంటను నిల్వ చేయడంలో లేదా తరలించడంలో సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రవాణా వ్యవస్థ సజావుగా సాగేందుకు ట్రాక్టర్ల మరియు లారీలు అందుబాటును సమీక్షించాలని అధికారులు సూచించారు.
పంట తేమ శాతం, నాణ్యత ప్రమాణాలపై సిబ్బంది స్పష్టమైన అవగాహనతో పని చేయాలని, రైతులకు తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం వేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపనతో రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న ఆన్లైన్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో పారదర్శకతను కాపాడుతూ, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసుకోవాలని కలెక్టర్ ప్రత్యేకంగా సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్క్ ఫెడ్ అధికారులు తహసీల్దార్ ఇబ్రహీం, తదితరులు ఉన్నారు.



