- – మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో:
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందు కు కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా మాజీ హోంశాఖ మంత్రి కే జానారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. సోమవారంనాడాయన మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. చర్చల ప్రక్రియలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన అనుభవాలు తెలుసుకోవడంతో పాటు, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణ పైనా చర్చించారు. దానికంటే ముందు కాంగ్రెస్‌పార్టీతో చర్చించాల్సి ఉందని సీఎం చెప్పారు. ఈ బాధ్యతను సీనియర్ నాయకులు జానారెడ్డి, కే కేశవరావు చేపడతారని తెలిపారు. ఆదివారం శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ తదితరులు సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం దీన్ని సామాజిక సమస్యగా చూస్తుందే తప్ప, శాంతి భద్రతల సమస్యగా చూడబోదని సీఎం వారికి స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టింది. కేంద్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారితో శాంతి చర్చలు జరపాలని పౌరసంఘాలు, వామపక్ష రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మావోయిస్టులతో చర్చల కోసం కమిటీ
RELATED ARTICLES