నవతెలంగాణ-సిటీబ్యూరో
భారీ ప్లీహావృద్ధి (స్ప్లీన్ పెరగడం), ప్యాన్సైటోపీనియా వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న 43 ఏండ్ల మహిళకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన స్ప్లీనెక్టమీ (ప్లీహా తొలగింపు శస్త్రచికిత్స) చేశారు. సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్, అనస్థీషియా వైద్యులు డాక్టర్ మురళి ఆధ్వర్యంలోని వైద్య వృందం ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. వారాసిగూడకు చెందిన ఓ మహిళ మూడు నెలలుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ప్లీహం చాలా పెద్దగా పెరిగి.. నాభి కింద వరకు విస్తరించినట్టు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ప్లీహం పరిమాణం సుమారు 19ఞ23 సెంటీమీటర్లుగా నమోదైంది. ఇది సాధారణ పరిమాణం కంటే ఎంతో ఎక్కువ. రక్తంలో మూడు ప్రధాన కణాల (ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్) సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స అత్యంత సవాలుగా మారినప్పటికీ, వైద్య బృందం జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ శస్త్రచికిత్స సమయంలో ప్లీహం బరువు సుమారు 2.8 కిలోల వరకు ఉన్నది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ, ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స సవాల్‌తో కూడినదని, సమయానికి చికిత్స అందించడం ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
‘గాంధీ’లో క్లిష్ట శస్త్రచికిత్స విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



